P Narayana: హైకోర్టులో నారాయణ కుటుంబ సభ్యుల హౌస్ మోషన్ పిటిషన్.. వారిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న కోర్టు

Anticipatory bail to Narayana Familay Members in 10th exam paper leak
  • ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన నారాయణ కుమార్తెలు, అల్లుడు, సిబ్బంది
  • నిందితులే కానప్పుడు రక్షణ కల్పిస్తే తప్పేంటని పోలీసులను ప్రశ్నించిన న్యాయస్థానం
  • 18వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశం
  • అదే రోజున పూర్తిస్థాయి విచారణ
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వారు హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు నిన్న ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు. పిటిషనర్లపై ఈ నెల 18వ తేదీ వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు.

పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు డీఈవో ఫిర్యాదు మేరకు చిత్తూరు వన్‌టౌన్ పోలీసులు నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఉన్న నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ 2014లోనే తప్పుకున్నట్టు ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు చూపించడంతో అదే రోజు ఆయనకు బెయిలు మంజూరైంది.

అయితే, ఇదే కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన నారాయణ కుటుంబ సభ్యులతోపాటు విద్యాసంస్థలకు చెందిన  జాలిపర్తి కొండలరావు, మాలెంపాటి కిశోర్‌, రాపూరు కోటేశ్వరరావు, వీపీఎన్‌ఆర్‌ ప్రసాద్‌, వి.శ్రీనాథ్‌, రాపూరు సాంబశివరావు, వై.వినయ్‌కుమార్‌, జి.సురేశ్‌కుమార్‌, ఎ.మునిశంకర్‌, బి.కోటేశ్వరరావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

తమకు మాల్‌ప్రాక్టీస్‌తో సంబంధం లేదని, పోలీసులు నమోదు చేసిన కేసులో తమను నిందితులుగా పేర్కొనలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులకు దిగువ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, కాబట్టి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ వారి తరపు న్యాయవాది అభ్యర్థించారు. 

పోలీసుల తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. పిటిషనర్లను నిందితులుగా పేర్కొననప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదన్నారు. స్పందించిన న్యాయస్థానం పిటిషనర్లు అసలు నిందితులే కానప్పుడు వారికి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే నష్టం ఏమిటని ప్రశ్నించారు. ఈ నెల 18 (బుధవారం) వరకు పిటిషనర్లపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జస్టిస్ మన్మథరావు ఆదేశాలు జారీ చేశారు.

P Narayana
Narayana Educational Society
10th Exam
Paper Leak
AP High Court
Anticipatory bail

More Telugu News