Cricket: ఉమ్రాన్ మాలిక్ పాకిస్థాన్ లో ఉండి ఉంటేనా... కశ్మీర్ క్రికెటర్ పై పాక్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

Pak Cricketer Controversial Statement on Umran Malik
  • ఉమ్రాన్ పాక్ లో ఉంటే జాతీయ జట్టుకు ఎంపికయ్యే వాడన్న కమ్రాన్ అక్మల్
  • ఎంపిక చేయకుండా టీమిండియా అతి తెలివి ప్రదర్శిస్తోందంటూ కామెంట్ 
  • బ్రెట్ లీ, అక్తర్ లాంటి స్ట్రైక్ బౌలర్లంతా ఉమ్రాన్ లాంటి వాళ్లేనని వ్యాఖ్య
ఉమ్రాన్ మాలిక్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో పెనుసంచలనం ఈ యువ బౌలర్. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధిస్తూ బ్యాటర్లు నివ్వెరపోయేలా చేస్తున్నాడు. అతడి స్వస్థలం జమ్మూకశ్మీర్. అతడిని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే, పాకిస్థాన్ కు చెందిన క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

అయితే, అతడు చేసిన ప్రశంసలే ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఉమ్రాన్ మాలిక్ ఎంపిక విషయంలో టీమిండియా అతితెలివిని ప్రదర్శిస్తోందంటూ వ్యాఖ్యానించాడు. ‘‘ఉమ్రాన్ మాలిక్ పాకిస్థాన్ లో ఉండి ఉంటే కచ్చితంగా జాతీయ జట్టుకు ఎంపికయ్యేవాడు. కచ్చితంగా తీసుకునేవాళ్లు. అతడి బౌలింగ్ సగటు ఎక్కువే ఉన్నా.. బంతుల్లో వేగం ఉంది. వికెట్టు కూడా తీస్తున్నాడు. ఒకప్పటి స్ట్రైక్ బౌలర్లంతా అంతే. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్ లీ, షోయబ్ అక్తర్ వంటి ఆటగాళ్లు అలాంటి వాళ్లే కదా. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పేస్ కచ్చితంగా ప్లస్ అవుతుంది’’ అని చెప్పుకొచ్చాడు. 

అలాంటి సమయంలో ఉమ్రాన్ ను ఎంపిక చేయకుండా.. పరిణతి సాధించేందుకు అతడికి ఇంకా సమయం కావాలంటూ ఇండియా తప్పించుకుంటోందని చెప్పాడు. గత ఏడాది ఐపీఎల్ లోనూ ఉమ్రాన్ ఆడాడని, ఇప్పటికీ పరిణతి రావాలనడం కరెక్ట్ కాదని చెప్పాడు. ఉమ్రాన్ ఎలా బౌలింగ్ చేస్తున్నాడన్నది తనకు పూర్తిగా తెలియదని, కానీ, వేగం మాత్రం తగ్గడం లేదని అన్నాడు.

ప్రస్తుతం టీమిండియాకు జస్ ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, నవ్ దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్ వంటి నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లున్నారని, ఇలాంటి సమయంలో ఎంపిక కష్టమేనని కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించాడు.
Cricket
Team India
Umran Malik
Pakistan
Kamran Akmal

More Telugu News