Manchu Vishnu: ప్రపంచ ప్రసిద్ధ డాక్టర్‌ భార‌త్‌లోనే ఉన్నప్పుడు వైద్యం కోసం మ‌లేషియాకు రావ‌డం ఎందుక‌ని వైద్యులు అన్నారు: మంచు విష్ణు

  • ఏఐజీ ఆసుప‌త్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత వైద్య ప‌రీక్ష‌లు 
  • పాల్గొని మాట్లాడిన విష్ణు, న‌రేశ్
  • గ‌తంలో మ‌లేషియాలో వైద్యం చేయించుకున్నాన‌న్న విష్ణు
  • వరల్డ్‌ ఫేమస్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి 'మా' సభ్యులకు సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ని వ్యాఖ్య‌
vishnu on maa service

హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆసుప‌త్రిలో 'మా' సభ్యుల కోసం ఉచిత వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మా అధ్య‌క్షుడు మంచు విష్ణు, సినీ న‌టుడు న‌రేశ్ పాల్గొని మాట్లాడారు. ఈ ఉచిత వైద్య పరీక్షలు చేసేందుకు ఏఐజీ ముందుకు రావడం హ‌ర్షించ‌ద‌గిన విష‌య‌మ‌ని, ఆ ఆసుప‌త్రి రుణాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదని మంచు విష్ణు అన్నాడు. భవిష్యత్తులోనూ 'మా' నుంచి ఆసుప‌త్రికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామ‌ని చెప్పాడు. 

గతంలో ఓసారి మలేషియాలో తాను షూటింగ్ లో పాల్గొంటున్న‌ప్పుడు త‌న‌కు గాయాలయ్యాయని తెలిపాడు. ఆ సమయంలో త‌మ‌ కుటుంబం మొత్తం మలేషియాలోనే ఉందని చెప్పాడు. దీంతో త‌న‌తో పాటు త‌న కుటుంబ స‌భ్యుల మొత్తానికి సింగపూర్‌లోని ఓ ఆసుప‌త్రిలో హెల్త్‌ చెకప్‌ చేయించామ‌ని, అప్పుడు ఓ వైద్యుడు త‌న వద్దకు వచ్చి, వరల్డ్‌ ఫేమస్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి భార‌త్‌లోనే ఉన్నప్పుడు వైద్యం కోసం మ‌లేషియాకు రావ‌డం ఎందుక‌ని అన్నార‌ని చెప్పారు. 

అంతటి గొప్ప వైద్యుడు 'మా' సభ్యులకు ఇప్పుడు సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. కాగా, 'మా' అసోసియేషన్ కు తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సభ్యులకు సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు పనిచేశామ‌ని న‌రేశ్ అన్నారు. వారికి బీమా ఇచ్చామ‌ని తెలిపారు. కరోనా స‌మ‌యంలో సభ్యులు ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నార‌ని, వారి ఆరోగ్యానికి పెద్ద పీట వేయాలని విష్ణు మంచి నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు.

More Telugu News