Sun Risers Hyderabad: వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓడిన హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు

  • ఆండ్రూ రసెల్ ఆల్‌రౌండ్ షో
  • బ్యాటింగ్‌లో ఎస్ఆర్‌హెచ్ దారుణ వైఫల్యం
  • గెలిచిన కోల్‌కతాకూ ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనట్టే!
Andre Russel All Round Show KKR Clinch Victory

సన్‌రైజర్స్ ప్లాప్ షో మరోమారు కొనసాగింది. తొలుత వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించి దుమ్మురేపిన ఆ జట్టును ఇప్పుడు పరాజయాలు వేధిస్తున్నాయి. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఓటమి పాలై వరుసగా ఐదో పరాజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమితో ఆ జట్టుకు ఉన్న ప్లే ఆఫ్స్ అవకాశాలు మూసుకుపోయాయి. విజయం సాధించిన కోల్‌కతాకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు లేనట్టే. 

ఆండ్రూ రసెల్, శామ్ బిల్లింగ్స్ అదరగొట్టడంతో కోల్‌కతా 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 178 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేసి విజయం ముంగిట బోల్తాపడింది. ఆ జట్టులో అభిషేక్ శర్మ, మార్కరమ్ తప్ప మరెవరూ రాణించలేకపోయారు. శర్మ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, మార్కరమ్ 25 బంతుల్లో మూడు సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 11 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో మరో ఘోర పరాజయం ఆ జట్టు ఖాతాలో చేరింది. బ్యాట్‌తో అదరగొట్టిన కేకేఆర్ ఆటగాడు ఆండ్రూ రసెల్ బంతితోనూ మ్యాజిక్ చేశాడు. మూడు వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ పతనాన్ని శాసించాడు. టిమ్ సౌథీకి రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. రహానే 28, నితీశ్ రాణా 26, బిల్లింగ్స్ 34 పరుగులు చేయగా, చివర్లో రసెల్ విరుచుకుపడ్డాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లతో 20 పరుగులు పిండుకోవడంతో జట్టు స్కోరు అమాంతం 177 పరుగులకు చేరుకుంది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఆండ్రూ రసెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి.

More Telugu News