మీ చీకటి మిత్రుడిపై ఈగవాలనివ్వరుగా!... అమిత్ షా ప్ర‌సంగంపై రేవంత్ సెటైర్‌!

14-05-2022 Sat 21:50
  • తుక్కుగూడ స‌భ‌లో అమిత్ షా ప్ర‌సంగం
  • షా ప్ర‌సంగంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన రేవంత్‌
  • త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలే లేవ‌ని ఆరోప‌ణ‌
  • కేసీఆర్ అవినీతిపై ఆర్భాట‌పు ప్ర‌క‌ట‌న‌లేన‌ని ఎద్దేవా
revanth reddt satires on amit shah speech
హైద‌రాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ‌లో శ‌నివారం సాయంత్రం జ‌రిగిన బీజేపీ స‌భ‌లో ఆ పార్టీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్ర‌సంగంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తుక్కుగూడలో అమిత్ షా ప్ర‌సంగం కొండంత రాగం తీసిన‌ట్లుగా ఉంద‌ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా రేవంత్ ఓ ట్వీట్ చేశారు.

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న అమిత్ షాకు తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కొన్ని ప్ర‌శ్న‌లు సంధించామ‌ని, అయితే వాటికి అమిత్ షా అస‌లు స‌మాధానాలే ఇవ్వ‌లేద‌ని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయిందని కూడా రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. 'అంతేలేండి… మీ చీకటి మిత్రుడిపై ఈగవాలనివ్వరుగా' అంటూ ఆయ‌న అమిత్ షాపై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.