BJP: టీఆర్ఎస్ విమ‌ర్శ‌ల‌ను గ‌ట్టిగా తిప్పికొట్టండి: బీజేపీ తెలంగాణ కోర్ క‌మిటీకి అమిత్ షా సూచ‌న‌

  • శంషాబాద్‌లో కోర్ క‌మిటీ నేత‌లతో అమిత్ షా భేటీ
  • ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని సూచ‌న‌
  • నేత‌ల‌పై అంత‌ర్గత నివేదిక‌ను ప్ర‌స్తావించిన అమిత్ షా
  • త‌రుణ్ చుగ్‌, కిష‌న్ రెడ్డి, విజ‌య‌శాంతిల‌తో ప్ర‌త్యేకంగా భేటీ
amit shah concludes bjp core committee meeting

కేంద్ర ప్ర‌భుత్వంపై టీఆర్ఎస్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను గట్టిగా తిప్పికొట్టాల‌ని బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ తెలంగాణ కోర్ క‌మిటీ నేత‌ల‌కు సూచించారు. బండి సంజ‌య్ చేప‌ట్టిన ప్ర‌జా సంగ్రామ యాత్ర ముగింపు కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా కాసేపటి క్రితం శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో పార్టీ తెలంగాణ కోర్ క‌మిటీ నేత‌ల‌తో భేటీ అయ్యారు. 

అరగంట పాటు సాగిన ఈ భేటీలో పార్టీ తెలంగాణ శాఖ‌కు అమిత్ షా ప‌లు సూచన‌లు చేశారు. వ‌చ్చే ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌ని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లకు సంబంధించి అంత‌ర్గ‌తంగా రూపొందించిన ఓ నివేదిక‌ను ప్ర‌స్తావిస్తూ అమిత్ షా ప‌లు కీల‌క సూచ‌న‌లు చేశారు. కోర్ క‌మిటీ భేటీని ముగించుకున్న అమిత్ షా తుక్కుగూడ‌లో జ‌ర‌గ‌నున్న బండి సంజయ్ పాద‌యాత్ర ముగింపు స‌మావేశానికి వెళ్ల‌నున్నారు.

భేటీలో భాగంగా బీజేపీ తెలంగాణ ఇంచార్జీ త‌రుణ్ చుగ్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, పార్టీ కీల‌క నేత విజ‌య‌శాంతిల‌తో అమిత్ షా ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని ఈ సంద‌ర్భంగా వారికి సూచించారు. అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చిన‌ట్లుగానే తెలంగాణ‌కు కూడా కేంద్రం నిధులు ఇస్తున్నామ‌న్న అమిత్ షా... ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని సూచించారు.

More Telugu News