అంబ‌టి రాయుడు రిటైర్ అవ్వ‌ట్లేదు: చెన్నై జ‌ట్టు సీఈఓ

14-05-2022 Sat 17:31
  • మ‌ధ్యాహ్నం రిటైర్మెంట్‌పై ట్వీట్ చేసిన రాయుడు
  • కాసేప‌టికే ట్వీట్‌ను డిలీట్ చేసిన క్రికెట‌ర్‌
  • రాయుడు రిటైర్మెంట్‌ అవ్వ‌ట్లేద‌న్న చెన్నై జ‌ట్టు సీఈఓ
cricketer ambati rayudu deletes tweet on his retirement
తెలుగు నేల‌కు చెందిన క్రికెట‌ర్ అంబ‌టి రాయుడి రిటైర్మెంట్‌కు సంబంధించి అత‌డు ఆడుతున్న చెన్నై జ‌ట్టు యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. రాయుడు రిటైర్ కావ‌ట్లేద‌ని జ‌ట్టు సీఈఓ విశ్వ‌నాథ్ వెల్ల‌డించారు. ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్న‌ట్లు శ‌నివారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించిన రాయుడు.. ఈ సీజ‌న్ ఐపీఎల్‌ త‌న‌కు చివ‌రి ఐపీఎల్ అంటూ పేర్కొన్నాడు. అయితే కాసేపటికే ఆ ట్వీట్ ను అత‌డు డిలీట్ చేశాడు. దీంతో అత‌డి రిటైర్మెంట్‌పై సందిగ్ధం నెల‌కొంది. 

అంబ‌టి రాయుడు రిటైర్మెంట్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు యాజ‌మాన్యం తోసిపుచ్చింది. రాయుడు రిటైర్ అవ్వ‌ట్లేద‌ని చెప్పిన సీఎస్కే జ‌ట్టు సీఈఓ విశ్వ‌నాథ్... పొర‌పాటుగా ఆ ట్వీట్ పెట్టి ఉంటాడ‌ని చెప్పారు. తాను రాయుడితో స్వ‌యంగా మాట్లాడాన‌ని కూడా ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో త‌న ఆట‌తీరు ప‌ట్ల రాయుడు అసంతృప్తిగా ఉన్నాడ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే రాయుడు పొర‌పాటున ఆ ట్వీట్ పెట్టి ఉంటాడ‌న్న విశ్వ‌నాథ్...రాయుడు క‌చ్చితంగా రిటైర్ అవ్వ‌ట్లేద‌ని తెలిపారు.