నీ ఒంట్లో ప్రవహించేది రాజ్ పుత్ ల రక్తమే అయితే... అంటూ రాకుమారి దియా కుమారికి షాజహాన్ వారసుడి సవాల్

  • తాజ్ మహల్ భూమి తమదేనన్న దియా
  • దానిపై ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ స్పందన
  • ఆ పత్రాలను చూపించాలని డిమాండ్
  • కబ్జా కాదు.. రాజ్ పుత్ ల కానుకని కామెంట్
  • తన 27 మంది బామ్మల్లో 14  మంది రాజ్ పుత్ లేనని వెల్లడి 
Shah Jahan Grand Son Responded To Diya Kumari Comments On Taj Mahal

తాజ్ మహల్ కట్టిన ఆ చోటు తమదేనని జైపూర్ రాకుమారి, బీజేపీ ఎంపీ దియా కుమారి నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరమైతే ఆ భూమికి సంబంధించిన పత్రాలనూ తాను చూపిస్తానని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై తాజాగా షాజహాన్ సంతతి వారసుడు, ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ ట్యూసీ స్పందించారు. 

ఇవాళ ఆయన ట్విట్టర్ లో వీడియోను విడుదల చేస్తూ, దియాకుమారి వ్యాఖ్యలను సవాల్ చేశారు. ఆమె ఒంట్లో ప్రవహించేది రాజ్ పుత్ ల రక్తమే అయితే.. తాజ్ మహల్ ఉన్న భూమి పత్రాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఆమెవి పిచ్చి వ్యాఖ్యలని అన్నారు. షాజహాన్.. రాజ్ పుత్ లకు వారి తల్లి తరఫు బంధువే అవుతాడని అన్నారు. అక్బర్ భార్య జోధా బాయీ అలియాస్ హర్కా బాయికి షాజహాన్ మనవడు అవుతాడని, షాజహాన్ రెండో భార్య లాల్ బాయి రాజ్ పుత్ అని అన్నారు. 

మొఘలులకు రాజ్ పుత్ లు ఆనాడు భూమిని కానుకగా ఇచ్చేవారన్నారు. అందులో భాగంగానే తాజ్ మహల్ కట్టిన స్థలమూ కానుకగానే వచ్చిందన్నారు. భూమిని ఆక్రమించారన్న దియాకుమారి వ్యాఖ్యలు నిరాధారమైనవని చెప్పారు. తనకున్న 27 మంది నానమ్మల్లో 14 మంది రాజ్ పుత్ లేనని పేర్కొన్నారు. అక్బర్ జమానా నుంచి రాజ్ పుత్ లు మొఘలులతో సంబంధాలు పెట్టుకున్నారని తెలిపారు. అలాంటి బంధాలను తెంచే ప్రయత్నం చేయొద్దని ఆమెకు హితవు చెప్పారు.

More Telugu News