Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీ చర్యను తప్పుబట్టిన శివసేన, బీజేపీ 

  • ఔరంగజేబు సమాధిని దర్శించి, నమాజ్ చేసిన అక్బరుద్దీన్
  • ఔరంగజేబును కీర్తిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్న బీజేపీ
  • ఔరంగజేబును ఈ మట్టిలోనే పాతిపెట్టామన్న శివసేన 
  • ఆయన అనుచరులకూ అదే గతి పడుతుందని హెచ్చరిక 
BJP Shiv Sena slam Akbaruddin Owaisi over visit to Aurangzebs tomb

ఔరంగజేబు సమాధిని దర్శించుకుని, నమాజ్ చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ చర్యను శివసేన, బీజేపీ తప్పుబట్టాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్దాబాద్ లో ఔరంగజేబు సమాధి ఉంది. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఔరంగజేబును కీర్తించడం ద్వారా అక్బరుద్దీన్ ఒవైసీ భారతీయ ముస్లింలను అవమానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు.

‘‘ఔరంగజేబును కీర్తించే ప్రయత్నాన్ని అక్బరుద్దీన్ చేశారు. ఇది జాతీయ భావం కలిగిన ముస్లింలను అవమానించినట్టు. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎంత మాత్రం ఆరాధ్యుడు కాడు. శంభాజీరాజాను చంపడానికి ముందు అతడిని హింసించాడు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. 

‘‘ఔరంగజేబును ఏ రూపంలో కీర్తించాలన్నా మేము భరించే స్థితిలో లేము. అలా చేసే వారు ప్రతి చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు లీలావతి హాస్పిటల్ (ఎంపీ నవనీత్ రాణా ఎంఆర్ఐ గది వద్ద ఫొటో తీసుకోవడం) వద్ద ఫొటో తీసుకున్నారని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఈ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు’’ అని ఫడ్నవిస్ విమర్శించారు.

ఇక ఇదే విషయంపై శివసేన కూడా తీవ్రంగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఔరంగజేబు. ఆయన సమాధి ముందు నమాజ్ చేయడం అంటే ఒవైసీ సోదరులు మహారాష్ట్రను సవాలు చేయడమే. ఒవైసీ సోదరులు రాజకీయం చేస్తున్నారు. ఈ మట్టిలోనే ఔరంగజేబును పాతిపెట్టాం. ఆయన అనుచరులు ఎవరైతే ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారో వారికీ అదే గతి పడుతుంది’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. 

అయితే, ఖుల్దాబాద్ కు ఎవరొచ్చినా ఔరంగజేబు సమాధిని సందర్శించడం మామూలేనని, ఇందులో భిన్నమైన అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు.

More Telugu News