Nithyananda: మాట్లాడలేకపోతున్నానంతే.. చనిపోలేదు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద

  • నిత్యానంద అనారోగ్యంతో చనిపోయినట్టు వార్తలు
  • తాను నిక్షేపంగా ఉన్నానంటూ ఫేస్‌బుక్ పోస్టు
  • సమాధిలోకి వెళ్లానని, ప్రస్తుతం మాట్లాడడం ఇబ్బందిగా ఉందన్న స్వామీజీ
  • 27 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడి
Swami Nithyananda scotches rumours of his death says he is in Samadhi

‘‘నేను బతికే ఉన్నాను.. ప్రస్తుతం సమాధిలో ఉన్నాను. ప్రస్తుతానికైతే మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నాను. 27 మంది వైద్యులు నాకు వైద్యం చేస్తున్నారు’’ ఇవీ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద చేసిన వ్యాఖ్యలు. అనారోగ్యంతో నిత్యానంద చనిపోయినట్టు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా స్పందించిన ఆయన ఓ ఫేస్‌బుక్ పోస్టులో ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బతికే ఉన్నట్టు స్పష్టం చేస్తూ పుకార్లకు తెరదించారు. 

నిత్యానంద నవంబరు 2019లో భారత్ వదిలి పారిపోయి ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నారు. దానికి ‘కైలాస’ అని నామకరణం చేసి దానికి ప్రధానిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు, దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఆ తర్వాత కైలాస డాలర్‌ను తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయన ప్రతీ ప్రకటన ఓ సంచలనమైంది.

ఇన్ని ప్రకటనలు చేసినా నిత్యానంద ఎక్కడ ఉన్నారన్న విషయం స్పష్టంగా ఎవరికీ తెలియదు. ఆయన ఈక్వెడార్‌లో ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నా.. ఆ వార్తలను ఆ దేశం ఖండిస్తోంది. కాగా, నిత్యానందపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన భారత్‌లో 50సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా దేశం నుంచి మాయమయ్యారు.

More Telugu News