TRS: కేసీఆర్ రాజ్య‌స‌భ సీటిస్తాన‌న్నా పొంగులేటి వ‌ద్దంటున్నారా?.. అస‌లు విష‌యం ఇదేన‌ట‌!

  • బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ సీటు
  • ఆ సీటును పొంగులేటికి ఆఫ‌ర్ చేసిన కేసీఆర్‌
  • రెండేళ్లలోనే ముగియ‌నున్న ఆ సీటు ప‌ద‌వీ కాలం
  • ఈ కార‌ణంగానే ఆఫ‌ర్‌పై పొంగులేటి సందిగ్థ‌త‌
ponguleti srinivasa reddy is not accepting kcr offer on rajya sabha seat

పిలిచి రాజ్య‌స‌భ సీటిస్తానంటే వ‌ద్ద‌నే నేత‌లుంటారా? ఎందుకంటే... ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండానే ఎంపీ అయిపోవ‌చ్చు క‌దా. అలాంటి బంగారం లాంటి అవ‌కాశాన్ని టీఆర్ఎస్ నేత‌, ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ‌ద్దంటున్నార‌ట‌. ఈ మేర‌కు శుక్ర‌వారం టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ఈ అంశంపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. కేసీఆర్ స్వ‌యంగా ఫోన్ చేసి మ‌రీ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ ఇచ్చినా పొంగులేటి సానుకూలంగా స్పందించ‌లేద‌న్న వార్త‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

ఈ దిశ‌గా అస‌లు విష‌యం ఏమిట‌న్న దానిపై ఓ చర్చ న‌డుస్తోంది. దాని ప్ర‌కారం... ఇటీవ‌లే తెలంగాణ‌లో ఎమ్మెల్సీగా అవ‌కాశం ద‌క్కించుకున్న బండ ప్ర‌కాశ్.. అంత‌కుముందు త‌న‌కు ద‌క్కిన రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. బండ ప్ర‌కాశ్ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఇంకో రెండేళ్ల పాటు ఉంది. అయినా కూడా ఆయ‌న ఎమ్మెల్సీ కోర‌డం, కేసీఆర్ ఒప్పుకోవడం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఈ క్ర‌మంలో బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌సభ సీటును ఇస్తానంటూ పొంగులేటికి కేసీఆర్ చెప్పార‌ట‌. వాస్త‌వానికి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం అంటే ఆరేళ్ల ప‌ద‌వీ కాలం ఉంటుంది క‌దా.. మ‌రి ఇప్పుడు కేసీఆర్ ప్ర‌తిపాదించిన మేర‌కు బండ ప్ర‌కాశ్ సీటును తీసుకునేందుకు సిద్ధ‌ప‌డితే... రెండేళ్ల‌లోనే ఆ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఈ కార‌ణంగానే స్వ‌యంగా కేసీఆర్ ఆఫ‌ర్ చేసినా.. రెండేళ్ల రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని తీసుకునేందుకు పొంగులేటి ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌. అయితే ఎలాగైనా పొంగులేటిని ఒప్పించే దిశ‌గా కేసీఆర్ త‌న య‌త్నాల‌ను కొన‌సాగిస్తున్నట్లుగా టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

More Telugu News