CSK: నిరాశ కలిగించింది.. కానీ, అంతా ఆటలో భాగమే: సీఎస్కే కోచ్ ఫ్లెమింగ్

  • ఇన్నింగ్స్ ఆరంభం గొప్పగా లేదు
  • మేము మెరుగ్గా ఆడాల్సి ఉంది
  • ముకేశ్, సిమర్ జీత్ ఎంతో మెరుగవుతున్నారు
  • దీపక్ కూడా వస్తే మరిన్ని ఆప్షన్లు ఉంటాయన్న ఫ్లెమింగ్
CSK coach Stephen Fleming on Devon Conways dismissal due to DRS glitch It was a little bit unlucky

ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇన్నింగ్స్ ఆరంభంలో కొద్ది సమయం పాటు పవర్ లేకపోవడంతో నిరాశకు గురైంది. ఎందుకంటే ఆ సమయంలోనే చెన్నై వరుస వెంట మూడు వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి దేవాన్ కాన్వే ఎల్బీడబ్ల్యూ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. డీఆర్ఎస్ కు వెళదామంటే (డెసిషన్ రివ్యూ సిస్టమ్/నిర్ణయంపై థర్డ్ అంపైర్ సమీక్ష).. ఆ సమయంలో పవర్ పోవడంతో డీఆర్ఎస్ అందుబాటులో లేదన్నారు. మొదటి 10 బాల్స్ కు డీఆర్ఎస్ అందుబాటులో లేదు.

దీనిపై చెన్నై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిరాశకు గురైనట్టు చెప్పారు. అయినా, అది ఆటలో భాగమేనని.. కొన్ని వరుస ఘటనలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చన్నారు. కానీ, తాము ఇంకా మెరుగ్గా ఆడాల్సిందని అంగీకరిస్తూ.. గొప్ప ఆరంభం మాత్రం కాదన్నారు. 

‘‘మా జట్టు సభ్యుల గురించి మేము ఇంకా తెలుసుకునే క్రమంలోనే ఉన్నాం. వచ్చే మ్యాచుల్లోనూ మరింత అధ్యయనం చేస్తాం. ఇది మాకు గొప్ప సీజన్ అయితే కాదు. మేము కొన్ని విభాగాల్లో మెరుగవ్వాల్సి ఉంది. అదే సమయంలో కొన్ని సానుకూలతలు కూడా ఉన్నాయి. సిమర్ జీత్, ముకేశ్ కొత్త బంతితో చేస్తున్న బౌలింగ్ అసాధారణంగా ఉంది. వారు ఎంతో మెరుగుపడుతున్నారు. ముకేశ్ బౌలింగ్ కు పూర్తి విశ్వాసం, సన్నద్దత సాధించాడు. సిమర్ జీత్ 3-4 మ్యాచులే ఆడాడు. అయినా అతడు కూడా కొంత నేర్చుకున్నాడు. ఇది కూడా సానుకూలమే. దీపక్ చాహర్ కూడా వస్తే కొత్త బంతితో మాకు మెరుగైన ఆప్షన్లు ఉంటాయి’’ అని ఫ్లెమింగ్ వివరించారు.

More Telugu News