Andhra Pradesh: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఐఆర్ రికవరీ చేయబోమని ఉత్తర్వులు

AP Govt Relief For Employees Says Not Recover the IR
  • పీఆర్సీ జీవోకు అనుబంధ జీవో జారీ
  • అంత్యక్రియల చార్జీలూ రూ.25 వేలకు పెంపు
  • బీమా శాతాన్నీ పెంచిన ప్రభుత్వం
ప్రభుత్వోద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐఆర్ రికవరీ లేకుండానే పీఆర్సీని అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇవాళ దానికి సంబంధించిన పీఆర్సీ అనుబంధ జీవోను సర్కారు విడుదల చేసింది. 27 శాతం ఐఆర్ లబ్ధి పొందినంత కాలం ఇది వర్తిస్తుందని అందులో పేర్కొంది. ఇక, ఉద్యోగి చనిపోతే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.25 వేలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇంతకుముందు వరకు రూ.15 వేలు ఇస్తున్న మొత్తాన్ని పెంచింది. ఉద్యోగుల బీమా వడ్డీ శాతాన్నీ ప్రభుత్వం సవరించింది. 

గరిష్ఠ వేతన పరిమితిని చేరిన ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను అమలు చేయాల్సిందిగా 11వ వేతన సవరణ కమిషన్ సూచించింది. అయితే, ఐఆర్ ను రికవరీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఐఆర్ ను రికవరీ చేయబోమంటూ వెల్లడించింది. 

పీఆర్సీలో పేర్కొన్న రూల్ 7కు అనుబంధంగా 7ఏ రూల్ ను జోడించింది. టైమ్ స్కేల్ దాటినా ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లను ఇస్తామని ప్రకటించింది. ప్రమోషన్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్, పింఛన్లకు సంబంధించి వాటిని సాధారణ పెంపుగానే పరిగణిస్తామని పేర్కొంది. 

2019 జులై నుంచి 2020 మార్చి 31 వరకు చెల్లించిన ఇంటీరియమ్ రిలీఫ్ ను రికవరీ చేయకూడదంటూ ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సిఫార్సు చేసిందని, వారి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ఐఆర్ ను రికవరీ చేయరాదన్న నిర్ణయానికి వచ్చామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. 

వేతన సవరణ తర్వాత ఉండే బకాయిలను (అరియర్స్)ను 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన డ్యూ డ్రాన్ (బకాయి ఉన్న మొత్తం, డ్రా చేసుకున్న మొత్తం) స్టేట్మెంట్లతో లెక్కిస్తామని చెప్పింది. వాటిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సర్వీసు రిజిస్టర్ లో నమోదు చేస్తామని పేర్కొంది. 

ఆ బకాయిలన్నింటినీ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయానికి చెల్లిస్తామని తెలిపింది. డ్యూ డ్రాన్ స్టేట్ మెంట్లకు సంబంధించిన సవివరణాత్మకంగా ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేస్తామని పేర్కొంది.
Andhra Pradesh
PRC
Employees
IR
Interim Relief

More Telugu News