హరీశ్ శంకర్ కు బండ్ల గణేశ్ ఖరీదైన చేతి గడియారం కానుక

  • పవన్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసిన హరీశ్
  • ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేశ్
  • నిన్నటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సినిమా
Bandla Ganesh Gifts a pricey watch to Harish Shankar

గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కు ఆ సినిమాను నిర్మించిన బండ్ల గణేశ్ ఖరీదైన కానుకను అందించారు. ఒమెగా సీమాస్టర్ అనే ప్రీమియం వాచ్ ను హరీశ్ శంకర్ కు బహూకరించారు. స్వయంగా ఆయనే హరీశ్ చేతికి గడియారాన్ని పెట్టారు. దానికి సంబంధించిన ఫొటోలను బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. తనకు గిఫ్ట్ ఇచ్చినట్టు హరీశ్ శంకర్ కూడా ట్విట్టర్ లో ఓ వీడయోను పోస్ట్ చేశారు. గణేశ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గబ్బర్ సింగ్ నిర్మాణానికి ఎనలేని మద్దతునిచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. 

‘‘నాకు మీరెప్పుడూ ప్రత్యేకమే. నువ్వు లేకపోతే సినిమా అంత వేగంగా అయ్యేదే కాదు. సినిమా అంటే పరితపించే మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా’’ అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. కాగా, హిందీలో 2010లో రిలీజైన సల్మాన్ ఖాన్ ‘దబాంగ్’ సినిమాను పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. 2012 మేలో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో విదితమే. 

నిన్నటికి ఆ సినిమా పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హరీశ్ కు రూ.5 లక్షల విలువ చేసే వాచీని బండ్ల గణేశ్ కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది.

More Telugu News