కాపులందరూ పవన్ పాటపాడుతుంటే.. ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారు: ఏపీ మంత్రి అంబటి

12-05-2022 Thu 09:03 | Andhra
  • చంద్రబాబు వెంటనే సీఎం అయిపోవాలని అనుకుంటున్నారన్న అంబటి
  • ప్రజలకు సేవ చేసి పీఎం అయినా మాకు అభ్యంతరం లేదన్న మంత్రి
  • జగన్ సింహంలా సింగిల్ గానే ఎన్నికలకు వెళ్తారన్న అంబటి
Minister Ambati Fires on Pawan and Chandrababu
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో నిన్న నిర్వహించిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాపులందరూ పవన్, పవన్ అని అంటుంటే, ఆయనేమో చంద్రబాబు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పనిలోపనిగా టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

చంద్రబాబు తాను వెంటనే సీఎం కావాలని  అనుకుంటున్నారని, అందుకనే క్విట్ జగన్ అని అంటున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజలకు మేలు చేసి ప్రధానమంత్రి అయినా తమకు అభ్యంతరం లేదన్న అంబటి.. పవన్, సీపీఐ, బీజేపీ మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జగన్ సింహంలా ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారని అన్నారు. తమ ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాల్లో ప్రజలకు రూ.1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చిందని, రానున్న రెండేళ్లలో మరో లక్ష కోట్ల రూపాయలను అందిస్తుందని అంబటి వివరించారు.