Andhra Pradesh: డ్రగ్స్ కేసు: కొరియర్ సంస్థలకు విజయవాడ డీసీపీ వార్నింగ్.. ఇకపై క్షుణ్ణంగా తనిఖీలని వెల్లడి

Vijayawada DCP Warns Courier Agencies Over Drugs Case
  • విజయవాడ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ కొరియర్ కేసు
  • మీడియా ముందుకు నిందితులు
  • చెన్నైలో చేస్తే దొరుకుతారని విజయవాడ నుంచి కొరియర్
  • కొరియర్ సంస్థలు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్
విజయవాడలో డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనకు సంబంధించిన వివరాలను ఇవాళ విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) మేరీ ప్రశాంతి వెల్లడించారు. ఇటీవల ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ను కొరియర్ చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే తెలిసిపోతుందన్న ఉద్దేశంతోనే నిందితులు విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేసేందుకు ప్రయత్నించారని ఆమె చెప్పారు. చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి విజయవాడ నుంచి డ్రగ్స్ ను కొరియర్ చేశాడని తెలిపారు. 

చెన్నైలో అరుణాచలాన్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. చెన్నైలోని బర్మా బజార్ లో పనిచేసే అరుణాచలాన్ని.. రూ.45 లక్షల విలువైన స్మగుల్డ్ గూడ్స్ ను తీసుకెళుతుండగా నాలుగు బృందాలుగా ఏర్పడి పట్టుకున్నామని చెప్పారు. గోపిసాయి అనే వ్యక్తి ఆధార్ ను ఫోర్జరీ చేసి అరుణాచలం వాడుకున్నాడని చెప్పారు. గోపిసాయి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. ఆ కేసులో విచారణ చేస్తే అసలు విషయాన్ని వెల్లడించాడన్నారు. 

బెంగళూరు కస్టమ్స్ అధికారులు డ్రగ్స్ కేసును విచారిస్తుండడంతో.. చెన్నై నుంచి కొరియర్ చేస్తే దొరికిపోతారన్న ఉద్దేశంతో విజయవాడను ఎంచుకున్నాడని పేర్కొన్నారు. ఇందులో మరో ఇద్దరి పాత్రపైనా విచారణ చేస్తున్నామన్నారు. కొరియర్ సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై విదేశాలకు పంపించే కొరియర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని డీసీపీ హెచ్చరించారు.
Andhra Pradesh
Vijayawada
DCP
Drugs
Crime News

More Telugu News