Cricket: స్వార్థపరుడంటూ శుభ్ మన్ గిల్ పై ట్రోల్స్.. రెండే రెండు ఎమోజీలతో గిల్ ఆన్సర్

Shubhman Gill Being Trolled By Netizens as Selfish Knock
  • నిన్న ఎల్ఎస్జీతో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్
  • 144 పరుగులు చేసిన గుజరాత్ జట్టు
  • 49 బంతుల్లో 63 పరుగులు చేసిన గిల్
  • సొంత రికార్డుల కోసం ఆడాడంటూ నెటిజన్ల విమర్శలు
టీమిండియాకు భవిష్యత్ ఆటగాడిగా ముందు వరుసలో ఉన్న ఆటగాడు శుభ్ మన్ గిల్. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో నాలుగు అర్ధసెంచరీలు బాది మంచి ఫామ్ లో ఉన్నాడు. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో జరిగిన మ్యాచ్ లో 49 బంతులాడి 7 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. 

అయితే, అర్ధ సెంచరీ చేసినా అతడి పెర్ఫార్మెన్స్ మాత్రం క్రికెట్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. టెస్ట్ మ్యాచ్ ఆడాడంటూ అతడిపై విరుచుకుపడ్డారు. స్వార్థపరుడంటూ మండిపడ్డారు. ఒక్కటేమిటి.. అతడి ఇన్నింగ్స్ పై నానా రకాల ట్రోల్స్ వచ్చి పడ్డాయి. సొంత రికార్డుల కోసం స్వార్థపూరితమైన ఆట ఆడాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుభ్ మన్ గిల్ తన ఇంటెంట్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. గిల్ కు రూపే ‘పెయిన్ ఫుల్ ఇన్నింగ్స్ అవార్డు’ను ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. 

ఆ కామెంట్లన్నింటికీ రెండే రెండు ఎమోజీలను పెట్టి గిల్ సమాధానం చెప్పాడు. ముందు తాబేలు.. దాని వెనుక కుందేలును పెట్టి వదిలేశాడు. ఇంతకీ ఆ ఎమోజీలకు అర్థమేంటో తెలుసు కదా! అవును.. ‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’. తెలుగులో చెప్పాలంటే నిదానమే ప్రధానమని. 

ట్రోల్స్ మాటెలా ఉన్నా.. అతడి ఇన్నింగ్స్ ఎంత విలువైనదో రెండో బ్యాటింగ్ చేసి 82 పరుగులకే కుప్పకూలిన ఇన్నింగ్సే చెబుతుంది. అవును, గిల్ ఆ మాత్రమైనా ఆడాడు కాబట్టే.. గుజరాత్ 144 పరుగులు చేయగలిగింది. ఆ మ్యాచ్ లో శుభ్ మన్ ఒక్కడే టాప్ స్కోరర్. బ్యాటింగ్ చేసేటప్పుడు పిచ్ పరిస్థితులు కూడా పరిగణనలోకి వస్తాయి. పిచ్ స్లోగా ఉండడం, బంతి తిరగడం లేదా బౌన్స్ అవడం వంటి కారణాలు బ్యాటర్ ను తిప్పలు పెట్టేస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఓపిగ్గా ఆడితేనే పరుగులు వస్తాయి. శుభ్ మన్ గిల్ అదే సూత్రాన్ని పాటించాడంటున్నారు నిపుణులు.
Cricket
IPL
Shubhman Gill
Team India

More Telugu News