Jasprit Bumrah: ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నాపై ప్రభావం చూపించవు: బుమ్రా

There is lot of noise outside but that doesnt affect me Jasprit Bumrah
  • తన రిథమ్ పట్ల సంతోషంగానే ఉన్నానన్న బుమ్రా 
  • అంతిమ ఫలితం తమ చేతుల్లో ఉండదని వ్యాఖ్య 
  • ఆటను అర్థం చేసుకుంటే తెలుస్తుందన్న ముంబై బౌలర్
ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని తాను పట్టించుకోనని ముంబై ఇండియన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రకటించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన పనితీరు పట్ల సంతోషంగా ఉన్నట్టు చెప్పాడు. ఎన్నో వ్యాఖ్యలు, విమర్శలు తనను వ్యక్తిగతంగా ప్రభావితం చేయలేవని స్పష్టం చేశాడు. 

సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం తెలిసిందే. చాలా కాలం తర్వాత అతడు తనలోని చక్కటి బౌలింగ్ పనితీరును ప్రదర్శించాడు. ఈ సీజన్ లో 11 మ్యాచుల్లో అతడు తీసిన మొత్తం వికెట్లు 10. నిన్నటి మ్యాచ్ ను మినహాయిస్తే అతడు ఈ సీజన్ లో పెద్దగా రాణించింది లేదు.

‘‘మ్యాచ్ కు మేము సన్నద్ధం అవుతాము. మాకంటూ విధానం ఉంటుంది. అంతిమ ఫలితాన్ని చూడం. మీరు ఆటను సరిగ్గా అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తున్నామో అర్థం చేసుకుంటారు. వ్యక్తిగతంగా అయితే ఈ టోర్నమెంట్ లో నా రిథమ్ పట్ల సంతోషంగానే ఉన్నాను. బయట ఎన్నో విమర్శలు, చర్చలు నడుస్తున్నట్టు తెలుసు. కానీ, అవి నాపై ప్రభావం చూపించవు. ఇతరులు ఏమి అనుకుంటున్నారనే కోణంలో నా పనితీరును నిర్ణయించుకునే వ్యక్తిని కాదు’’ అని బుమ్రా పేర్కొన్నాడు.
Jasprit Bumrah
mumbai indians
IPL

More Telugu News