AC: ఏసీ వాడుతున్నారా.. అయితే, ఇవి తెలుసుకోండి!

  • సీలింగ్ ఫ్యాన్ తక్కువలో పెట్టుకుంటే మంచి ఫలితం
  • ఏసీ టెంపరేచర్ 24-27 మధ్య సెట్ చేసుకోవాలి
  • వారానికోసారి ఏసీ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి
  • స్టెబిలైజర్ ఫిట్ చేసుకోవడమే మంచిది
important things that you may not know about your AC

వేసవిలో ఎయిర్ కండిషనర్ల (ఏసీలు) వినియోగం ఎక్కువగా ఉంటుంది. పెరిగిపోతున్న ఎండల తీవ్రతకు సామాన్యులు సైతం ఏసీలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏసీల పట్ల ఆదరణ కూడా పెరిగిందని చెప్పుకోవాలి. అయితే, వినియోగం, నిర్వహణ పరంగా చాలా మందికి కనీస విషయాలు కూడా తెలియవు. ఏసీ ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని తెలుసుకోవాల్సిందే.

సీలింగ్ ఫ్యాన్ 
ఏసీ నడుస్తున్నప్పుడు గదిలో సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేయడం మంచి విధానం. తక్కువ స్పీడ్ లేదా మీడియం స్పీడ్ లో ఫ్యాన్ ను పెట్టుకోవాలి. అప్పుడు గది అంతటా ఒకే రకమైన ఉష్ణోగ్రత కొనసాగుతుంది. కానీ, సీలింగ్ ఫ్యాన్ ను అధిక స్పీడ్ లో పెడితే అప్పుడు గది చల్లబడేందుకు చాలా సమయం తీసుకుంటుంది. చల్లదనం వృథాగా పోతుంది.

ఎనర్జీ ఎఫీషియన్సీ రేషియో
ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫీషియన్సీ రేషియో (ఐసీర్) మార్క్ ను ఏసీ యూనిట్ పై చూడొచ్చు. ఒక ఏడాది ఎంత విద్యుత్ ను ఏసీ వినియోగించుకుని, ఎంత వేడిని తొలగించగలదనే దానిని ఇది సూచిస్తుంది. ఐసీర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేడిని తీసేసి, చల్లదనాన్ని ఇస్తుందని అర్థం చేసుకోవచ్చు. టన్నేజీని బట్టి ఐసీర్ కూడా మారిపోతుంది. కాకపోతే ఇది కొన్నేళ్లకోసారి మారుతుంటుంది. కనుక ఇప్పుడు 5 స్టార్ ఏసీ కొన్నేళ్ల తర్వాత 4 స్టార్ లేదా 3 స్టార్ కు తగ్గిపోవచ్చు.

తక్కువలో ఏసీ సెట్టింగ్
ఏసీ రిమోట్ లో టెంపరేచర్ ను తక్కువలో పెడితే గది తొందరగా చల్లబడుతుందని అనుకుంటారు. కానీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) ప్రకారం మానవ శరీరానికి 24 డిగ్రీలు అన్నది సరైనది. దీనివల్ల ఏసీపై లోడ్ కూడా తక్కువగా పడుతుంది. కనుక 24-27 మధ్య ఏసీని నడిపించుకోవచ్చు. అందుకే, ఏసీలలో 24 డిగ్రీల వద్ద డిఫాల్టుగా ఉంటుంది.

అవుట్ డోర్ యూనిట్
ఏసీ అవుట్ డోర్ యూనిట్ ను నేరుగా ఎండ తగిలే చోట ఫిట్ చేస్తుండడాన్ని చూడొచ్చు. దీనికి బదులు నీడ ఉన్న చోట అవుట్ డోర్ యూనిట్ ను ఏర్పాటు చేయడం వల్ల మరింత మెరుగ్గా పనిచేసేందుకు వీలుంటుంది. అధిక వేడికి గురి కావాల్సిన ఇబ్బంది తప్పుతుంది. మన్నిక కూడా పెరుగుతుంది. 

ఏసీ ఫిల్టర్ శుభ్రం చేసుకోవాలి
చాలా మంది ఏసీలను ఆన్ చేసి వాడుకోవడమే కానీ దాన్ని అస్సలు పట్టించుకోరు. ఇది సరికాదు. ఏసీ పై భాగంలో ఉండే ఫిల్టర్ ను వారానికి ఒక్క రోజు అయినా క్లీన్ చేసుకోవాలి. లేదంటే గదిని చల్లబరిచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనివల్ల అధిక విద్యుత్ ఖర్చు అవుతుంది. ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల గాలి ప్రసారానికి అడ్డంకులు తొలగి మంచి పనితీరును చూపిస్తుంది.

గదిలో ఎంత మంది..?
గదిలో ఎంత మంది ఉన్నారు? అన్నది కూడా చల్లదనాన్ని నిర్ణయిస్తుంది. గది విస్తీర్ణం, ఏసీ టన్నేజీ సామర్థ్యం, గదిలో ఎంత మంది ఉంటారు? వీటిని బట్టే చల్లదనం, విద్యుత్ బిల్లు ఆధారపడి ఉంటాయి. 

సర్వీసింగ్
ఏసీని ఏటా ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది. ఏడాది పాటు వాడకుండా ఉండడం వల్ల దుమ్ము చేరి పోతుంది. సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల పనితీరు మెరుగ్గా ఉండి, తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.

స్టెబిలైజర్ కావాల్సిందే
స్టెబిలైజర్ ఫ్రీ ఏసీలు అని ప్రకటనలు చూస్తుంటాం. అంటే స్టెబిలైజర్ అవసరం లేదని అనుకోవద్దు. స్టెబిలైజర్ ఫ్రీ అంటే సదరు ఏసీలో నిర్ణీత ఓల్టేజీల వరకు విద్యుత్ హెచ్చు, తగ్గులు వచ్చినా రక్షణ ఉంటుందని అర్థం. ఏసీ యూజర్ మాన్యువల్ లో వోల్టేజీ వివరాలు ఉంటాయి. ఆ వోల్టేజీ పరిధిలో తేడాలను ఏసీ యూనిట్ తట్టుకోగలదు. ఆ పరిధికి మించి ఓల్టేజీ తేడాలు మీరుంటున్న ప్రాంతంలో కనిపిస్తే వెంటనే ఓల్టేజీ స్టెబిలైజర్ బిగించుకోవడం మంచిది. దీనివల్ల విలువైన ఏసీ యూనిట్ ను కాపాడుకున్నట్టు అవుతుంది. 

రిమోట్ లో ఆఫ్ చేయడం
ఏసీలను ఎక్కువ మంది రిమోట్ లోనే ఆన్, ఆఫ్ చేస్తుంటారు. రిమోట్ లో కట్టేసినా కొంత విద్యుత్ ఖర్చవుతుంటుంది. ఎందుకంటే ఏసీ యూనిట్ ఐడిల్ గా ఉండి, తిరిగి ఆన్ చేస్తే పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుంది.

More Telugu News