IMD: కొంచెం ఊరట.. ‘అసని’ తుపాను బలహీనపడే అవకాశాలు.. తుపాను వేళ ఈ జాగ్రత్తలు పాటించండి!

Cyclone Asani Unlikely Landfall may weaken by tomorrow
  • రేపు సాయంత్రానికి బలహీనం
  • కాకినాడకు 300 కిలోమీటర్ల దూరంలో తుపాను
  • గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • ఇప్పటికే తమిళనాడులో కురుస్తున్న వర్షాలు
తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన ‘అసని’ రేపు సాయంత్రానికి బలహీనపడుతుందని, తీరాన్ని తాకే అవకాశాలు తక్కువని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఉదయం వెల్లడించిన బులెటిన్ లో ఈ విషయాన్ని పేర్కొంది. 

ప్రస్తుతం తుపాను కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖపట్టణానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. 10 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని, తద్వారా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 

తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నట్టు తెలిపింది. కాగా, ఇప్పటికే విశాఖపట్టణం సహా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. మరోవైపు పూరీకి కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తుపాను కేంద్రీకృతమై ఉందని ఒడిశా వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ నాగరత్న చెప్పారు. తుపానుతో భారత్ తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ పైనా ప్రభావం ఉండనుంది.

కాగా, తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడును వర్షాలు తాకాయి. చెన్నై, తిరుచురాపల్లి, కడలూరు, పుదుచ్చేరి, సేలం, కరైకల్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, ఒడిశాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

తుపాను నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. 

  • ముందుగానే ఆహారాన్ని దాచుకోండి.
  • ఇల్లు సురక్షితం కాదనుకుంటే వేరే భద్రమైన చోటుకు వెళ్లిపోవాలి. 
  • ఎమర్జెన్సీ కిట్ ను దగ్గర పెట్టుకోండి. ప్రథమ చికిత్స బాక్స్ తో పాటు గట్టి తాళ్లు, టార్చి లైట్లు, అదనపు బ్యాటరీలు, క్యాండిళ్లు అందుబాటులో ఉంచుకోవాలి. 
  • ముఖ్యమైన పత్రాలను వాటర్ ప్రూఫ్ బ్యాగులో దాచుకోండి. 
  • తుపాను వచ్చేటప్పుడు ఇళ్లలోనే ఉండేవారు.. విద్యుత్ మెయిన్ ను ఆఫ్ చేయండి. గ్యాస్ కనెక్షన్ ను తొలగించండి. 
  • తలుపులు, కిటికీలు మూసి ఉంచుకోండి. 
  • నీళ్లను మరిగించి తాగాలి. లేదా ఫిల్టర్ వాటర్ తాగాలి. 
  • విరిగిన కరెంట్ స్తంభాలు, తెగిన–వేలాడుతున్న విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలి.  
IMD
Cyclone
Asani
Rains
Andhra Pradesh
Odisha

More Telugu News