Cricket: రోహిత్ ఔట్ వ్యవహారంపై మండిపడుతున్న నెటిజన్లు.. బ్యాటుకు ఆమడ దూరంలో బంతి.. ఇదిగో వీడియో

Third Umpire Decision On Rohit Out Sparks Row As Netizens Suggest Umpire Needs 3D Glasses
  • బంతి దూరంగా వెళుతున్నా అల్ట్రాఎడ్జ్ లో స్పైక్స్
  • ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్
  • చెత్త అంపైరింగ్ అంటూ నెటిజన్ల ఫైర్
ఐపీఎల్ తాజా సీజన్ లో అంపైరింగ్ నిర్ణయాలు, లోపాలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న నో బాల్ వ్యవహారం, కోహ్లీ ఔట్ దుమారం రేపగా.. ఇప్పుడు రోహిత్ ఔట్ వ్యవహారం పెను ప్రకంపనలే సృష్టిస్తోంది. అవును మరి, బ్యాటుకు బంతి ఆమడ దూరంలో ఉన్నా.. అల్ట్రాఎడ్జ్ లో స్పైక్స్ రావడం, ఏమీ ఆలోచించకుండా థర్డ్ అంపైర్.. రోహిత్ ను ఔట్ గా ప్రకటించడం ఇటు క్రికెట్ ప్రేక్షకులతో పాటు ముంబై అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. 

టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని రోహిత్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించగా.. బంతి తొడ ప్యాడ్స్ కు తగిలి కీపర్ చేతుల్లో పడింది. కోల్ కతా నైట్ రైడర్స్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ వీడియోలను పరిశీలించాడు. ఆ వీడియోల్లో బ్యాటుకు బంతి దూరంలో ఉండగానే స్పైక్స్ రావడం కనిపించింది. అయినా గానీ థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో ట్విట్టర్ లో నెటిజన్లు థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సెన్ ఫోర్డ్ నిర్ణయాన్ని ఓ ఆటాడేసుకున్నారు. 

అంపైర్ కు త్రీడీ కళ్లద్దాలు ఇవ్వాల్సిందంటూ ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. రోహిత్ నాటౌట్ అని, అంపైర్ ది తప్పుడు నిర్ణయమని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. బ్యాటును బంతి తాకకముందే స్పైక్స్ వచ్చాయంటే అది కచ్చితంగా సాంకేతిక లోపమేనని, థర్డ్ అంపైర్ కళ్లు తెరచి చూడాల్సిందని మరో వ్యక్తి మండిపడ్డాడు. తొలుత రోహిత్ ఔట్.. ఇప్పుడు ఈ బౌండరీ అంటూ థర్డ్ అంపైర్ నిర్ణయంపై మరో యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ లో మాత్రమే ఇంత చెత్త అంపైరింగ్ నడుస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Cricket
IPL
Rohit Sharma
Mumbai Indians
Umpire

More Telugu News