వద్దని ఎంత చెప్పినా వినలేదు.. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల ఎంపికపై పరుచూరి గోపాలకృష్ణ

10-05-2022 Tue 11:46 | Entertainment
  • 'పరుచూరి పాఠాలు' పేరుతో గోపాలకృష్ణ కబుర్లు 
  • హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కథలుండాలన్న రచయిత
  • శంకర్ దాదా జిందాబాద్ సినిమా చిరుకు సెట్ కాదన్నానని వ్యాఖ్య
  • అల్లరిపిడుగులో తండ్రి పాత్ర కూడా బాలయ్యే వేయాలని చెప్పానని వెల్లడి
  • అయినా వాళ్లు వినలేదని చెప్పిన గోపాలకృష్ణ
Paruchuri Gopalakrishna Interesting Comments On Chiranjeevi and Balakrishna
చిరంజీవి, బాలకృష్ణలపై ప్రముఖ కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో ఆయన చాలా విషయాలపై మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరోలు–వారి బాడీ లాంగ్వేజ్–కథలు అనే అంశంపై మాట్లాడారు. హీరో బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు సినిమా కథ, సన్నివేశాలు ఉండాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆయన చిరంజీవి, బాలకృష్ణలకు ఎదురైన అనుభవాల గురించి గుర్తు చేశారు. 

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాపై మాట్లాడారు. చిరంజీవికి ఆ సినిమా సరిపోదని, సూట్ కాదని చెప్పానని గుర్తు చేశారు. నక్సలైట్ పాత్ర వల్ల చిరంజీవి కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చిందన్నారు. గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమా విషయంలోనూ ఆ సినిమా చిరంజీవికి సెట్ కాదని చెప్పానన్నారు. 

చిరంజీవి ఇమేజ్ మహా వృక్షమన్న ఆయన.. అలాంటి వ్యక్తి సినిమాలో శాంతి వచనాలు చెబితే ప్రేక్షకులకు నచ్చదని చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవికి చెప్పానన్నారు. అయితే, ఆయన తాను చెప్పిన మాటను పట్టించుకోలేదన్నారు. ‘మీరు కాస్త రెబల్ కాబట్టి నచ్చదు లెండి’ అంటూ ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారని పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు’ సినిమాకు సంబంధించి కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. వారికి ఉన్న అభిమానగణం.. సినిమాను ఎంటర్ టైన్ చేయాలని కోరుకుంటారన్నారు. 

బాలకృష్ణ 'అల్లరిపిడుగు' సినిమా టైంలోనూ పలు సూచనలు చేశానని గుర్తు చేశారు. సినిమాలోని తండ్రి పాత్రను బాలకృష్ణనే వేయాల్సిందిగా చెప్పానన్నారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ముంబై వ్యక్తిని తండ్రిగా పెట్టడం.. ఆ వ్యక్తికి బాలకృష్ణ భయపడడం జనానికి నచ్చదని వివరించానన్నారు. అయితే, సినిమా దర్శకుడు, నిర్మాత వినలేదని పేర్కొన్నారు. చివరకు ఆ సినిమా బోల్తా కొట్టిందన్నారు. పెద్దన్నయ్య సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేస్తే అందరికీ నచ్చిందని చెప్పారు.