Dadisetti Raja: నేను ఎవరి జోలికీ వెళ్లను.. నా జోలికి వస్తే ఊరుకోను: ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరిక

Dadisetty Raja Warns that he is not a Gandhi
  • తునిలో వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మంత్రి
  • తన జోలికి వస్తే ఊరుకునేందుకు గాంధీని కానని హెచ్చరిక
  • జగన్ సమర్థుడని, ఒంటరిగానే పోటీచేస్తారని ప్రశంస

కాకినాడ జిల్లా తునిలో నిన్న జరిగిన వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఏపీ రహదారులు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తాను ఎవరి జోలికీ వెళ్లనని, తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టనని అన్నారు. తన జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టేందుకు తానేమీ గాంధీని కాదని అన్నారు. 

తునిలో ఇటీవల ఓ ఘటన జరగ్గా ఓ పార్టీ వారిపై నమోదైన అట్రాసిటీ కేసుల విషయంలో తన ప్రమేయం ఉందన్న వార్తలపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఇద్దరి మధ్య రేకెత్తిన వివాదం పెరిగి దాడి చేసుకునే వరకు చేరిందని, దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారని మంత్రి అన్నారు. 

పోలీస్ స్టేషన్‌లో పెట్టిన వారిని తానే విడిపించానన్నారు. ఆ పార్టీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. ఐదుగురు జనసేన నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏపీలో ప్రస్తుతం చర్చనీయాంశమైన పొత్తులపై రాజా మాట్లాడుతూ.. జగన్ సమర్థుడని, ఆయన ఒంటరిగానే పోటీ చేస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News