Nara Lokesh: సీఎం నియోజకవర్గంలో కన్ స్ట్రక్షన్ కంపెనీ సిబ్బందిని వైసీపీ నేత కొండారెడ్డి బెదిరించారు: నారా లోకేశ్

Nara Lokesh slams YCP leaders
  • రాయచోటిలో రోడ్డు పనులు చేస్తున్న ఎస్సార్కే సంస్థ
  • వైసీపీ నేత కొండారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
  • డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నాడంటూ సంస్థ ఫిర్యాదు
  • సీఎం నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అంటూ లోకేశ్ వ్యాఖ్యలు
వైసీపీ నేతల దోపిడీకి ఏదీ అనర్హం కాదంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాయచోటిలో రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఎస్సార్కే కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను వైసీపీ నేత కొండారెడ్డి బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. కొండారెడ్డి పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైసీపీ ఇన్చార్జి. అయితే, తమ మండలంలో పనులు చేయాలంటే తమకు ముడుపులు ఇవ్వాల్సిందేనని కొండారెడ్డి రోడ్డు పనుల కాంట్రాక్టర్ ను బెదిరించినట్టు ఫిర్యాదులో వివరించారు. 

దీనిపై నారా లోకేశ్ స్పందించారు. ఇసుక, మద్యం... ఇలా అన్నింటా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. పులివెందుల నియోజకవర్గంలో కన్ స్ట్రక్షన్ కంపెనీ వారిని వైసీపీ నేత కొండారెడ్డి బెదిరించారని తెలిపారు. వారి నుంచి డబ్బులు గుంజబోయారని వివరించారు. 

సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరుగుతున్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు, ఫిర్యాదుల వరకు రాని దందాలు చాలా ఉన్నాయన్న విషయం తెలుస్తోందని అన్నారు. అన్ని వర్గాల వారిని పట్టి పీడిస్తున్న అవినీతి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Nara Lokesh
YCP Leaders
Kondareddy
Pulivendula
TDP

More Telugu News