Telangana: సిద్దిపేట జిల్లాలో దారుణం: పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Wife killed husband with the help of lover in siddipet
  • పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించిన యువతి
  • భర్తను హతమార్చేందుకు అన్నంలో ఎలుకల మందు కలిపిన వైనం
  • తిని ఆసుపత్రిపాలైన భర్త
  • ఈసారి మరింత పకడ్బందీగా ప్లాన్
  • ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి గొంతుకు రుమాలు బిగించి చంపేసిన వైనం
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి కాళ్ల పారాణి కూడా ఆరకముందే ప్రియుడితో కలిసి గొంతు నులిమి భర్తను హత్య చేసింది. ఆపై దొరికిపోయి కటకటాలపాలైంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దుబ్బాక మండలం చిన్ననిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న వివాహం జరిగింది. 

పెళ్లి ముందునుంచే అదే గ్రామానికి చెందిన శివకుమార్ (20)తో శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉంది. పెద్దల బలవంతంతో చంద్రశేఖర్‌తో పెళ్లికి అంగీకరించినా ప్రియుడిని మర్చిపోలేకపోయింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గత నెల 19న ఆహారంలో ఎలుకల మందు కలిపి భర్తకు వడ్డించింది. అస్వస్థతకు గురైన భర్త హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసింది. మొక్కు ఉందని, తీర్చుకునేందుకు వెళ్దామంటూ గత నెల 28న భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరింది. ఈ క్రమంలో అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదామంటూ అక్కడి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది.

అప్పటికే అక్కడ మాటువేసిన ప్రియుడు శివ, అతడి స్నేహితులు రాకేశ్, రంజిత్, శ్యామల మేనబావ సాయికృష్ణ, వరుసకు సోదరుడైన భార్గవ్ కలిసి చంద్రశేఖర్‌పై దాడిచేశారు. అపై అందరూ కలిసి చంద్రశేఖర్‌ను కదలకుండా పట్టుకోగా ప్రియుడితో కలిసి శ్యామల భర్త గొంతుకు రుమాలు బిగించి చంపేసింది. అనంతరం బంధువులకు ఫోన్ చేసి చాతీ నొప్పితో చనిపోయాడని చెప్పింది. అనుమానించిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఆరుగురు యువకులనూ అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Telangana
Siddipet District
Murder
Crime News

More Telugu News