సమావేశానికి ఆ విలేకరులు వచ్చారా?.. ఏం లేదు, వస్తే తిట్టి పంపుదామని..: మంత్రి అంబటి రాంబాబు

09-05-2022 Mon 07:09 | Andhra
  • వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం ఉందని కబురు
  • వెళ్లాక వైసీపీ నియోజకవర్గ నేతలతో అంబటి సమావేశం
  • కొండపోరంబోకు భూములపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావించిన మంత్రి 
  • కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి ఆ విలేకరులు వచ్చారా? అని ప్రశ్న
AP Minister Ambati asks reporters that anyone came from against media
‘సమావేశానికి ఆ విలేకరులు ఎవరూ రాలేదు కదా?.. వస్తే తిట్టి పంపుదామని’ అంటూ ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం ఉందంటూ కొందరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం అందింది. అయితే, మంత్రికి బదులుగా వైసీపీ నియోజకవర్గ నేతలతోనే సమావేశాన్ని కానిచ్చేశారు. చాంబర్‌లోనే ఉన్న అంబటి సమావేశం ముగిశాక విలేకరులను పిలిచి మాట్లాడారు.

తన పనితీరు ఎలా ఉందో చెప్పాలని విలేకరులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టులో కొండపోరంబోకు భూముల పరిహారాన్ని అధికారులు బినామీ పేర్లతో పక్కదారి పట్టిస్తున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని ప్రస్తావించిన మంత్రి ఈ ఘటనపై విచారణ చేయిస్తామని అన్నారు.

అనంతరం, ఈ సమావేశానికి తమ పార్టీ వ్యతిరేక మీడియాకు చెందిన విలేకరులు ఎవరైనా వచ్చారా? అని కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి ప్రశ్నించారు. రాలేదని వారు చెప్పగానే మంత్రి స్పందిస్తూ.. ‘‘ఏం లేదు, వస్తే తిట్టి పంపుదామని’’ అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.