వీధుల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదు: యూపీ సీఎం ఆదిత్యనాథ్

08-05-2022 Sun 18:55 | National
  • ఝాన్సీలో అధికారులతో సమీక్ష
  • ఇటీవలి పరిణామాలపై అధికారులకు ఆదేశాలు
  • ఉదాసీనతను క్షమించబోమని స్పష్టీకరణ
Uttar Pradesh CM Yogi Adityanath says no religious activities on roads
ఉత్తరప్రదేశ్ లోని ఇటీవలి పరిణామాలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఝాన్సీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వీధుల్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏ ఒక్కరిని కూడా అనుమతించొద్దు అని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ మతపరమైన స్థలాల్లోపలే జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉదాసీన వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించేది లేదని అన్నారు. రాష్ట్రంలో మాఫియా కార్యకలాపాలను నిర్మూలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఇటీవల లలిత్ పూర్ లో న్యాయం కోసం వచ్చిన బాలికపై పోలీసులే అత్యాచారానికి పాల్పడిన ఘటనపైనా సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలకు స్పష్టం చేశారు.