YSRCP: విశాఖ వైసీపీలో ర‌గ‌డ‌... వైవీ సుబ్బారెడ్డి ఎదుటే ఇరువ‌ర్గాల తోపులాట‌

  • టీడీపీ త‌ర‌ఫున గెలిచి వైసీపీకి ద‌గ్గ‌రైన వాసుప‌ల్లి గ‌ణేశ్‌
  • విశాఖ ద‌క్షిణ‌లో ఆది నుంచి వైసీపీ నేత‌గా సుధాక‌ర్‌
  • నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌లో భాగంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య నినాదాల హోరు
clash between vasupalli ganesh and sudhakar supportes infront of yv subbareddy

ఏపీలో అధికార పార్టీ వైసీపీ విశాఖ న‌గ‌ర శాఖ‌లో రెండు వ‌ర్గాలుగా విడిపోయిన ఇద్ద‌రు నేత‌లు ప‌ర‌స్ప‌రం వాదులాడుకున్నారు. ఈ త‌తంగం మొత్తం పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకెళితే... 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విశాఖ ద‌క్షిణ‌ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్ కుమార్ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. త‌న కుమారుడిని వైసీపీలో చేర్పించిన వాసుప‌ల్లి.. తాను టీడీపీకి దూరం జ‌రిగారు. ఈ క్ర‌మంలో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆది నుంచి వైసీపీలో కొన‌సాగుతున్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ సుధాక‌ర్‌, గణేశ్ మ‌ధ్య వ‌ర్గ విభేదాలు త‌లెత్తాయి.

ఈ క్ర‌మంలో శ‌నివారం పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్ హోదాలో విశాఖ వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వాసుప‌ల్లి, సుధాక‌ర్ వ‌ర్గాల‌కు చెందిన శ్రేణులు ప‌ర‌స్ప‌రం నినాదాలు చేసుకున్నాయి. అంతేకాకుండా ఇరు వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ప‌ర‌స్ప‌రం తోసుకున్నారు. త‌న ఎదురుగా జ‌రుగుతున్న ఈ తతంగంపై వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఇరు వ‌ర్గాలు వెన‌క్కు త‌గ్గాయి.

More Telugu News