Taliban: బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు మహిళలు పూర్తిగా కప్పి ఉంచే బురఖా ధరించాలి: ఆఫ్ఘన్ లో తాలిబన్ అగ్రనేత హుకుం

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
  • నిజస్వరూపం బయటపెట్టుకుంటున్న తాలిబన్లు
  • మహిళలకు ముఖ్యమైన పని ఉంటేనే బయటికి రావాలని ఆదేశం
  • కళ్లు మాత్రమే కనిపించేలా బురఖా ధరించాలని స్పష్టీకరణ
Taliban chief orders women must wear Burqa with full covering

ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ పాలనా పగ్గాలు చేతబూనిన తాలిబన్లు క్రమంగా తమ అసలు రూపం బయటపెడుతున్నారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పివేసే బురఖా ధరించి రావాలని ఆఫ్ఘనిస్థాన్ సుప్రీంనేత, తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖుంద్ జాదా హుకుం జారీ చేశారు. తల పైభాగం నుంచి పాదాల వరకు ఉండే ఛదోరి (బురఖా) సంప్రదాయబద్ధమైనదని, ఇది ధరించడం వల్ల గౌరవప్రదంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

మరీ వృద్ధులు కాని వారు, మరీ చిన్నవయసు కాని స్త్రీలు తమ ముఖాన్ని తప్పక దాచుకోవాలని, వారి కళ్లు మాత్రమే కనిపించేలా దుస్తులు ఉండాలని, షరియా చట్టం ఇదే చెబుతోందని అఖుంద్ జాదా పేర్కొన్నారు. స్త్రీలు పర పురుషులను కలిసినప్పుడు వారిలో రెచ్చగొట్టే భావనలను ఈ బురఖా (చదోరి) నివారిస్తుందని వివరించారు. 

అంతేకాదు, ఎంతో ముఖ్యమైన పని ఉంటేనే మహిళలు బయటికి రావాలని, లేని పక్షంలో వారు ఇంట్లో ఉండడమే మంచిది అని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు అఖుంద్ జాదా జారీ చేసిన హుకుంను కాబూల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తాలిబన్ వర్గాలు విడుదల చేశాయి.

More Telugu News