Mahesh Babu: 'సర్కారు వారి పాట' విడుదల నేపథ్యంలో... అభిమానులకు లేఖ రాసిన మహేశ్ బాబు

Mahesh Babu wrote letter to fans ahead of Sarkaaru Vaari Pata release
  • మహేశ్ బాబు హీరోగా 'సర్కారు వారి పాట'
  • పరశురామ్ దర్శకత్వంలో చిత్రం
  • ఈ నెల 12న రిలీజ్
  • అభిమానులు థియేటర్లలో చూడాలని మహేశ్ బాబు పిలుపు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన అభిమానులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. ప్రియమైన అభిమాన మిత్రులకు అంటూ మొదలుపెట్టిన ఆయన... 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగ్ ముగించుకుని, అన్ని పనులు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోందని వెల్లడించారు. ఈ సినిమా ఆడియో 'సరేగమ' కంపెనీ ద్వారా మార్కెట్లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోందని తెలిపారు. 

ఈ నేపథ్యంలో... ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న మన 'సర్కారు వారి పాట' చిత్రం థియేటర్లలో చూసి మీ స్పందన తెలియజేయగలరు అంటూ మహేశ్ బాబు తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు, మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. 'ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి' అంటూ మహేశ్ తన లేఖను ముగించారు. 

పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై 'సర్కారు వారి పాట' చిత్రం తెరకెక్కింది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపి నిర్మాతలు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయిక. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికే సూపర్ హిట్టయ్యాయి.
.
Mahesh Babu
Letter
Fans
Sarkaru Vaari Paata
Tollywood

More Telugu News