Vladimir Putin: పుతిన్ ప్రియురాలు అలీనాపై ఈయూ ఆంక్షలు!

EU imposed sanctions on Putin girl friend Alina Kabaeva
  • పుతిన్ ప్రియురాలు 38 ఏళ్ల అలీనా కబయేవా
  • వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం
  • ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉంటున్న అలీనా
ఉక్రెయిన్ పై దండయాత్ర చేస్తున్న రష్యాను నిలువరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ) తో పాటు పలు దేశాలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రష్యాపై కఠినమైన ఆంక్షలను కూడా విధిస్తున్నాయి. తాజాగా ఈయూ ఆరో ఆంక్షల ప్యాకేజీని ప్రతిపాదించింది. తాజా ఆంక్షల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రియురాలు అలీనా కబయేవా పేరు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

38 ఏళ్ల అలీనా జిమ్నాస్ట్, మోడల్, గాయని, రాజకీయ నాయకురాలు కూడా. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్స్ లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించారు. అంతేకాదు తన కెరీర్ లో 14 ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు, 21 యూరోపియన్ ఛాంపియన్ షిప్ పతకాలను కైవసం చేసుకున్నారు. పుతిన్ కు, ఈమెకు ముగ్గురు పిల్లలు పుట్టినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్ లోని ఓ విలాసవంతమైన విల్లాలో ఉంటున్నట్టు సమాచారం. ఈ విల్లాకు అత్యంత భద్రత ఉంటుంది.

మరోవైపు తాజా ఆంక్షలకు సంబంధించిన జాబితాను తన సభ్య దేశాలకు ఈయూ పంపించింది. ఈ జాబితాను సమాఖ్యలోని 27 దేశాలు ఆమోదించాల్సి ఉంది. ఒకవేళ ఈ జాబితా ఆమోదం పొందితే.... అలీనా ఈయూలో అడుగు పెట్టకుండా ఆమెపై నిషేధం అమల్లోకి వస్తుంది. అంతేకాదు ఆమె ఆస్తులను కూడా స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
Vladimir Putin
Girl Friend
Alina Kabaeva
European Union

More Telugu News