Rohit Sharma: దేనికైనా అదృష్టం కలసి రావాలి: రోహిత్ శర్మ

Everything Need is Luck Says Rohit After Victory
  • అలాంటి రోజున గెలుపును లాగేసుకుంటామన్న రోహిత్ 
  • ఒత్తిడిలో సామ్స్ బౌలింగ్ బాగా చేశాడని కితాబు 
  • టిమ్ డేవిడ్ పైనా రోహిత్ ప్రశంసలు
నిన్న గుజరాత్ టైటాన్స్ ను ముంబై ఇండియన్స్ ఓడించిందిగానీ.. చివర్లో అదృష్టం కలిసొచ్చింది జట్టుకు. గుజరాత్ బ్యాటర్ల జోరు చూస్తే ముంబైకి మరో పరాభవం తప్పదనిపించింది. కానీ, చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన డేనియల్ సామ్స్.. కేవలం 3 పరుగులే ఇచ్చి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 9 పరుగులు చేయాల్సిన దశలో చతికిల పడింది. ఫలితంగా విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

విజయంపై ముంబై సారథి రోహిత్ శర్మ స్పందించాడు. గెలుపు ఎప్పుడైనా తియ్యగానే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘‘మ్యాచ్ చివర్లో చాలా టైట్ గా సాగింది. గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. మాకు కావాల్సింది ఇదే. దేనికైనా అదృష్టం కలసి రావాలి. ఎప్పుడో ఒకచోట అదృష్టం రావాలి. అలాంటప్పుడు గెలుపును లాగేసుకుంటాం’’ అని మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. 

వాస్తవానికి తాము 15 నుంచి 20 పరుగులు తక్కువే చేశామని, గెలుపులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందని అన్నాడు. డేనియల్ సామ్స్, టిమ్ డేవిడ్ పై ప్రశంసలు కురిపించాడు. టిమ్ డేవిడ్ బ్యాటింగ్ సూపర్ అని చెప్పాడు. ఒత్తిడిలో సామ్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. కోల్ కతాతో మ్యాచ్ లో ఒక ఓవర్ లో 35 పరుగులిచ్చి.. ఇప్పుడు ఇలా కేవలం 3 పరుగులే ఇచ్చి గెలుపులో కీలకం కావడం స్పెషల్ అన్నాడు. 

ఏ మ్యాచ్ కా మ్యాచ్  కొత్తదేనని, ఆరోజు ఎవరు బాగా ఆడితే వారే గెలుస్తారని చెప్పుకొచ్చాడు. అదృష్టం కొద్దీ ఇవాళ మార్పులు చేసుకునేందుకు అవకాశం దొరికిందని రోహిత్ అన్నాడు. ప్రత్యర్థులు తమకు స్లో బంతులేసి కట్టడి చేశారని, అదే వ్యూహాన్ని తామూ అమలు చేశామని చెప్పాడు. మ్యాచ్ గెలిచినా మంచి ఉత్తమమైన ఆట మాత్రం ఆడలేదని వివరించాడు.
Rohit Sharma
Cricket
IPL
Mumbai Indians

More Telugu News