యూపీలో వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి దుర్మరణం

07-05-2022 Sat 09:25 | National
  • ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఘటన
  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్
7 killed died in an accident on Yamuna Expressway in Mathura while going to attend a marriage
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. యమున ఎక్స్‌ప్రెస్ వే పై మధుర వద్ద ఓ కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. కారులో ఉన్న ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 

ఈ దారుణ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మధురలోని నౌజీల్‌లో 68వ మైలురాయి వద్ద ప్రమాదం సంభవించింది. బాధితులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు.