క్రెడిట్ కార్డు రద్దు చేసుకుంటే.. క్రెడిట్ స్కోరులో కోత.. ఇవీ దాని ప్రభావాలు!

 • క్లోజ్ చేస్తే ఏడేళ్లు దాని ప్రభావం
 • పెద్దగా వాడడం లేదని రద్దు చేయొద్దు
 • వీలైతే ప్రత్యామ్నాయాలను చూడాలి
 • అత్యవసరమైతేనే రద్దు చేసుకోవాలి
Credit Score Will Get Effected If You Close Card

రుణాలు రావాలన్నా.. క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా.. క్రెడిట్ స్కోరు కీలకం. ఆ స్కోరు ఎంత బాగా ఉంటే లోన్ అంత త్వరగా, ఎక్కువగా వస్తుంటుంది. అయితే, ఆ క్రెడిట్ స్కోరుకు.. క్రెడిట్ కార్డులను రద్దు చేసుకుంటే కత్తెర పడుతుందన్న విషయం ఎంత మందికి తెలుసు? 

ఎక్కువ వాడకపోవడం వల్ల కావొచ్చు.. లేదా వార్షిక రుసుములు ఎక్కువగా ఉండడం వల్ల కావొచ్చు.. చాలా మంది క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ, అది క్రెడిట్ స్కోరుపై భారీ ప్రభావాన్నే చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగని క్రెడిట్ కార్డును రద్దు చేసుకోవద్దనీ వాళ్లు చెప్పట్లేదు. కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు. 

ఇదీ ఎఫెక్ట్...

క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉన్న కార్డులను రద్దు చేసుకుంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెంత ఉన్న క్రెడిట్ లిమిట్ లో ఎంత వాడుకున్నారనేదీ ఎఫెక్ట్ కు కారణమవుతుంది. ఒక్కో కార్డువారీగా లేదా ఉన్న మొత్తం కార్డుల వారీగానూ దానిని లెక్కిస్తారు. ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్ లో 30 శాతం కన్నా తక్కువ వాడుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడు మంచి స్కోరు ఉంటుందంటున్నారు. ఎక్కువ క్రెడిట్ స్కోర్లున్నవారు 10 శాతం కన్నా తక్కువ లిమిట్ ను వాడుకుంటున్నవాళ్లేనని అంటున్నారు. 

ఒక క్రెడిట్ కార్డును ఎంత కాలం నుంచి వాడుతున్నారన్న దానిపైనా క్రెడిట్ స్కోరు ఆధారపడి ఉంటుంది. అయితే, వాడుకుంటున్న అమౌంట్ తో పోలిస్తే ఆ ప్రభావం తక్కువే. ఒక క్రెడిట్ కార్డును క్లోజ్ చేసేస్తే పాత హిస్టరీ అంతా పోతుంది. అంటే రుణాలు ఇచ్చే సమయంలో ఇంతకుముందున్న వాటినీ చూస్తారు కాబట్టి.. క్రెడిట్ కార్డును క్లోజ్ చేస్తే ఆ పాత వివరాలేవీ ఉండే చాన్స్ ఉండదు. 

ఒకవేళ క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినప్పుడు ఏవైనా బకాయిలుంటే.. దాని ప్రభావం 5 నుంచి ఏడేళ్ల పాటు ఉంటుంది. క్రెడిట్ కార్డును క్లోజ్ చేసినా మంచి స్కోరు రావాలంటే.. కొన్ని నెలల పాటు ఎప్పటికప్పుడు చెల్లింపులను చేస్తూ ఉండాలి. 

ఇలాంటి సందర్భాల్లో రద్దు చేసుకోవాలి

 • క్రెడిట్ కార్డు వార్షిక రుసుము ఎక్కువగా ఉండి.. సర్వీసులు బాగా లేని కార్డులను రద్దు చేసుకోవచ్చు. 
 • కొన్ని కార్డులు ఎప్పటికీ పనికిరావు. క్రెడిట్ కార్డులపై అవగాహన కల్పించేందుకుగానూ ఇచ్చే సెక్యూర్డ్ కార్డ్స్ ను మధ్యలోనే రద్దు చేసుకోవచ్చు. పూర్తి అవగాహన వచ్చిందని భావిస్తే వాటిని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 
 • కొన్ని సార్లు జీవిత భాగస్వాములతో కొన్ని కార్డులను జాయింట్ గా తీసుకుంటాం. అయితే, విడాకుల సందర్భాల్లో అలాంటి క్రెడిట్ కార్డులను రద్దు చేసుకోవచ్చు. ఒకరికి తెలియకుండా మరొకరు అనధికార లావాదేవీలు చేయడం నుంచి నివారించవచ్చు. 
 • అప్పులు పెరిగి క్రెడిట్ కార్డు లావాదేవీలు భారంగా అనిపించినప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. 

ఎప్పుడు క్లోజ్ చేయకూడదంటే..

 • క్రెడిట్ రిపోర్టులో కార్డుకు ఎక్కువ హిస్టరీ ఉంటే రద్దు చేసుకోవద్దు. 
 • క్రెడిట్ అకౌంట్లు తక్కువగా ఉన్నప్పుడు కార్డును రద్దు చేయడం వల్ల స్కోరు తగ్గే ప్రమాదం ఉంటుంది. 
 • పెద్దగా వాడడం లేదని అస్సలు రద్దు చేసుకోరాదు. 

రద్దు చేయాలనుకుంటే ఇవి పాటించాల్సిందే.. 
 • ఒకవేళ కార్డును రద్దు చేసుకోవాలనుకుంటే దానికి ఉన్న బకాయిలన్నింటినీ కచ్చితంగా చెల్లించేయాల్సిందే. 
 • కార్డు మీద ఆటోమేటిక్ పేమెంట్స్ ఉంటే వాటిని రద్దు చేసుకోవాలి. 
 • కార్డు మీద ఉన్న పాయింట్లన్నింటినీ రిడీమ్ చేసుకోవడం మరచిపోవద్దు. కొన్ని సంస్థలు రిడీమ్ చేసుకునే పాయింట్ల ద్వారా చెల్లింపులకు అవకాశమిస్తాయి. 
 • కార్డును రద్దు చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని కస్టమర్ కేర్ ద్వారా తెలియజేయాలి. క్లోజ్ అయినట్టు మెయిల్ ద్వారా కన్ఫర్మ్ చేయాలంటూ రిక్వెస్ట్ చేయాలి. 
 • కార్డు రద్దు అయిన తర్వాత ముక్కలు చేసి పారేయాలి. 

ప్రత్యామ్నాయాలూ ఉన్నాయ్...

 • కార్డులో సర్వీసు బాగా లేదనుకున్నా.. వార్షిక ఫీజులు ఎక్కువగా అనిపించినా ఓ సారి సంస్థకు ఫోన్ చేయండి. ఫీజును తగ్గించమని కోరండి. లేదా అదే సంస్థకు చెందిన మరో కార్డుకూ మారేందుకు అవకాశం అడగండి. తద్వారా పేమెంట్ హిస్టరీ చెదిరిపోకుండా ఉంటుంది. స్కోరుకు భంగం ఉండదు. 
 • మంచి ఆఫర్లున్న కార్డుకు మారాలనుకుంటే మాత్రం ముందు క్రెడిట్ స్కోరును మరింత మెరుగుపరచుకోండి. కార్డును యాక్టివ్ గా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ ఉండండి. వాడడం లేదు అనుకునే బదులు.. కరెంట్ లేదా గ్యాస్ వంటి వాటి బిల్లులకు కార్డును అనుసంధానించండి. దాని వల్ల స్కోరు పెరిగి కొత్త క్రెడిట్ కార్డును తీసుకునేందుకు వీలుంటుంది. 
 • అతి వాడకాన్ని తగ్గించుకోండి. వాలెట్ నుంచి కార్డును తీసి ఎక్కడైనా దాచేయండి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులుంటే తీసి వాడుకోవచ్చు. 
 • షాపింగ్ సైట్లలో సేవ్ చేసి పెట్టిన కార్డు వివరాలను పూర్తిగా తొలగించేసేయండి. తద్వారా అతి వాడకం తగ్గుతుంది. 

More Telugu News