రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' సినిమా విడుదలకు మరోసారి అడ్డంకి.. స్టే ఇచ్చిన కోర్టు!

05-05-2022 Thu 16:12 | Entertainment
  • సినిమా విడుదల కాకుండా స్టే తెచ్చిన నట్టి కుమార్
  • నట్టి క్రాంతికి మొత్తం డబ్బులు ఇచ్చిన తర్వాతే విడుదల చేయాలన్న కోర్టు
  • థియేటర్ లో కానీ, ఓటీటీలో కానీ విడుదల చేయకూడదన్న కోర్టు
Natti Kumar gives one more shock to Ram Gopal Varma
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ రూపంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇద్దరు యువతుల మధ్య లెస్బియన్ కథాంశంతో తెరకెక్కిన 'మా ఇష్టం' చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, వర్మ తనకు డబ్బులు ఇవ్వాలని, అందువల్ల విడుదలను ఆపేయాలని కోర్టు నుంచి నట్టి కుమార్ స్టే తెచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై వర్మ స్పందిస్తూ, ఈ సినిమా ఆగింది నట్టి కుమార్ వల్ల కాదని... సినిమాకు స్క్రీన్లు దొరక్క పోవడం వల్లే విడుదల ఆగిందని వర్మ చెప్పుకొచ్చారు. 

అయితే, రేపు (మే 6) సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్మకు నట్టి కుమార్ మరోసారి షాకిచ్చారు. రేపు సినిమా విడుదల చేయకూడదంటూ కోర్టు నుంచి మరో స్టే తీసుకొచ్చారు. ఈ సారి వర్మకు కోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతికి మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని... అంతవరకు థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దీనిపై వర్మ ఇంకా స్పందించాల్సి ఉంది.