WHO: ఒమిక్రాన్ లో మరో రెండు కొత్త ఉపరకాలు.. వెల్లడించిన డబ్ల్యూహెచ్ వో చీఫ్

  • దక్షిణాఫ్రికాలో వెలుగులోకి బీఏ 4, బీఏ 5
  • కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయన్న టెడ్రోస్
  • ఆ తర్వాత ఏం జరుగుతుందోనని ఆందోళన
  • ఎలా మారుతోందో కూడా తెలియట్లేదని ఆవేదన
Omicron Sees another 2 new sub variants

దేశంలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ దోబూచులాడుతున్నాయి. చైనాలో కేసులు, మరణాలు పెరుగుతుండడంతో కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలోనూ మహమ్మారి విజృంభిస్తోంది. థర్డ్ వేవ్ లో ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్ లోనే మరిన్ని ఉత్పరివర్తనాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ఆందోళన వ్యక్తం చేసింది. 

చాలా దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్  బీఏ2 ప్రభావమే ఎక్కువగా ఉన్నా.. దక్షిణాఫ్రికాలో మాత్రం బీఏ 4, బీఏ 5 అనే కొత్త ఉపరకాలు కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో.. ఏమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 

వైరస్ ఎలా మారుతోందో..ఏంటో కూడా తెలియడం లేదన్నారు. చాలా దేశాలు వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడాన్ని ఆపేశాయని, కానీ, దక్షిణాఫ్రికా ఇంకా కొనసాగిస్తోందని చెప్పారు. ఈ క్రమంలోనే రెండు కొత్త ఉప రకాలను గుర్తించగలిగామని అన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

కాగా, ప్రపంచ వ్యాప్తంగా గత వారంలో కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని డబ్ల్యూహెచ్ వో నివేదిక వెల్లడించింది. గత వారం 15 వేల మంది చనిపోయారని, ఈ సంఖ్య కరోనా ప్రారంభ రోజుల కన్నా తక్కువని చెప్పింది.

More Telugu News