Congress: కాంగ్రెస్ లోక్ సభా పక్షనేతకు వ్యతిరేకంగా చిదంబరం కేసు వాదన.. సొంత పార్టీ నేతల నుంచే చిదంబరానికి సెగ

Chidambaram Heckled By Own Party Leaders
  • బెంగాల్ ప్రభుత్వంపై అధీర్ రంజన్ చౌదరీ పిటిషన్
  • మెట్రో డెయిరీ అమ్మకంలో అవకతవకలని ఆరోపణ
  • కెవెంటర్స్ అనే సంస్థకు కట్టబెట్టారని నింద
  • ఆ సంస్థ తరపున చిదంబరం వాదన
  • నల్లా జెండాలతో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
  • రాజకీయాలు, వృత్తి వేర్వేరన్న అధీర్ 
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి సొంత పార్టీ కార్యకర్తల నుంచి సెగ తగిలింది. కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌదరీకి వ్యతిరేకంగా కేసు వాదించేందుకు కోల్ కతా వచ్చిన ఆయనకు నల్లా జెండాలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికి నిరసన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వ పాల ఉత్పత్తుల సంస్థ అయిన మెట్రో డెయిరీని కెవెంటర్స్ అనే ప్రైవేట్ సంస్థకు 2015లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వాటాను అమ్మిందని, అందులో అవకతవకలు, అవినీతి జరిగాయని ఆరోపిస్తూ అధీర్ రంజన్ చౌదరీ పిటిషన్ వేశారు. స్వతహాగా అడ్వొకేట్ అయిన పి. చిదంబరం.. ఈ కేసులో ప్రైవేట్ సంస్థ అయిన కెవెంటర్స్ తరఫున వాదిస్తున్నారు. 

ఈ క్రమంలోనే పిల్ పై ప్రైవేటు సంస్థకు అనుకూలంగా చిదంబరం వాదించడం పట్ల లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ బెంగాల్ చీఫ్ అయిన అధీర్ రంజన్ చౌదరీ స్పందించారు. వృత్తిని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని కోరారు. ‘‘చిదంబరం కోల్ కతా వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురై ఉంటారు. అందుకే ఇలా చిదంబరానికి సెగ తగిలింది. రాజకీయాలు, వృత్తి.. రెండు వేర్వేరు. చిదంబరంతో నాకు మంచి స్నేహం ఉంది’’ అని అధీర్ రంజన్ చౌదరీ అన్నారు.
Congress
Chidambaram
West Bengal
Adhir Ranjan Chowdhary

More Telugu News