diet: ఆస్తమా నియంత్రణలో ఆహారం పాత్ర ఎంతో..

  • కొన్ని రకాల ఆహారాలతో ఉపశమనం
  • కొన్నింటితో ఆస్తమా లక్షణాలు తీవ్రతరం
  • సరిపడని వాటిని గుర్తించి దూరం పెట్టాలి
  • అలా చేస్తే చక్కని ఉపశమనం
Does diet play a role in asthma prevention or treatment

ఆస్తమాతో బాధపడుతున్న వారు చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్నట్టే.. ఆహారపరమైన మార్పులు చేసుకోవడం కూడా అవసరం అవుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా స్పందించినప్పుడు అది ఆహారపరమైన అలర్జీలకు దారితీస్తుంది. ఇది కొంత మంది ప్రజల్లో ఆస్తమాకు దారితీయవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆస్తమాకు అంటూ ప్రత్యేకమైన ఆహారం ఉండదని, కొన్ని రకాల పదార్థాలు, పోషకాలు ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడేందుకు సాయపడతాయని సూచిస్తున్నారు.

విటమిన్ డీ
విటమిన్ డీ ఆస్తమా నుంచి రక్షణనిస్తుంది. ముఖ్యంగా 6 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు డీ విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు రూపంలో విటమిన్ డీ అందుతుంది. పాలు, గుడ్లు కొందరికి అలర్జీకి కారణమవుతాయి. పడని వారు వీటిని తీసుకోకూడదు. 

విటమిన్ ఏ
పిల్లల రక్తంలో విటమిన్ ఏ తగినంత ఉన్నట్టయితే అటువంటి వారికి ఆస్తమా సమస్య తక్కువగా ఉంటున్నట్టు పలు అధ్యయనాలు గుర్తించాయి. పిల్లలో విటమిన్ ఏ అధికంగా ఉంటే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుందట. క్యారట్, బ్రక్కోలీ, ఆలుగడ్డ, పాలకూర తదితర వాటిల్లో విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది.

పండ్లు
రోజూ ఒక యాపిల్ తీసుకుంటే ఆస్తమా రిస్క్ తగ్గుతుంది. ఊపరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అరటి పండులో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా నివారణకు ఉపయోగపడతాయి. 

మెగ్నీషియం
మెగ్నీషియం తక్కువగా ఉంటే శ్వాసకోస వ్యవస్థ పనితీరు కూడా తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. కనుక గుమ్మడి గింజలు, చేపలు, డార్క్ చాక్లెట్, పాలకూర తదితర మెగ్నీషియం తగినంత లభించే వాటిని తీసుకోవాలి. 

వీటిని దూరం పెట్టాలి..
కొన్ని ఆహార పదార్థాలు ఆస్తమాకు కారణం కాకపోయినా, ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. కనుక వాటికి దూరంగా ఉండడం అవసరం. సల్ఫైట్స్ అనే ప్రిజర్వేటివ్ ఆస్తమా లక్షణాలను పెంచుతుంది. ప్యాకేజ్డ్ పచ్చళ్లు, ప్యాకేజ్డ్ లెమన్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పై సల్ఫైట్స్ ఉంటాయి. కాఫీ, టీ, కొన్ని రకాల సుగంధ, మసాల దినుసుల్లోని శాలిసిలేట్స్ కూడా ఉబ్బసాన్ని పెంచుతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో వాడే ప్రిజర్వేటివ్ లు, ఆర్టిఫీషియల్ కలర్స్, ఫ్లావర్స్ తోనూ సమస్య పెరుగుతుంది.

More Telugu News