RK Selvamani: హైదరాబాద్, వైజాగ్ లలో తమిళ సినిమాల షూటింగులు వద్దు: రోజా భర్త ఆర్కే సెల్వమణి

RK Selvamani requests Tamil heroes not to shoot films in Hyderabad and Vizag
  • పెద్ద హీరోలు పక్క రాష్ట్రాల్లో షూటింగులు చేసుకుంటున్నారన్న సెల్వమణి 
  • దీని వల్ల తమిళ పరిశ్రమలోని కార్మికులకు నష్టం జరుగుతోందని వ్యాఖ్య 
  • అజిత్ ప్రతి చిత్రం హైదరాబాదులోనే చిత్రీకరణ జరుపుకుంటోందన్న సెల్వమణి 
తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు సంబంధించి ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, వైజాగ్ లలో సినిమా షూటింగులు ఆపేయాలని ఆయన తమిళ సినీ పరిశ్రమను కోరారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోయారని చెప్పారు. 

తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ లలో షూటింగులు చేపడుతున్నారని... దీని వల్ల తమిళ సినీ కార్మికులను నష్టం జరుగుతోందని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదని... అయితే, భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు. 

పయనూరులో దేశంలోనే అతి పెద్దది, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఎత్తైన ప్రహరీ గోడతో 15 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం ఉందని చెప్పారు. అక్కడ ఎలాంటి భయం లేకుండానే షూటింగులు చేసుకోవచ్చని అన్నారు. చెన్నైలో షూటింగులకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయని చెప్పారు.  

తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలనే తమ విన్నపం పట్ల హీరో విజయ్ సానుకూలంగా స్పందించారని సెల్వమణి అన్నారు. అజిత్ కూడా సానుకూలంగా స్పందించాలని కోరారు. అజిత్ ప్రతి చిత్రం హైదరాబాదులోనే చిత్రీకరణ జరుపుకుంటోందని... దీని వల్ల తమిళ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సి)కి అధ్యక్షుడుగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 
RK Selvamani
Kollywood
Tollywood
Tamil Movies
Shooting
Hyderabad
Vizag

More Telugu News