Royal Challengers Bengaluru: బెంగళూరు చేతిలో ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్!

  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించిన ఆర్సీబీ
  • పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి డుప్లెసిస్ సేన
  • హర్షల్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు
RCB Defeated CSK Now Du plesis team in fourth place

హ్యాట్రిక్ పరాజయాలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్రేక్ వేసింది. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో పూణెలో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. తొలుత బ్యాటర్లు రాణించడంతో 173 పరుగుల భారీ స్కోరు సాధించిన డుప్లెసిస్ సేన ఆ తర్వాత బంతితోనూ మెరిసింది. చెన్నైని 160 పరుగులకే పరిమితం చేసి విజయాన్ని అందుకుంది.

174 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైని బెంగళూరు బౌలర్లు దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్ 3, మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయడంతో చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. గత మ్యాచ్‌లో చెలరేగిపోయిన రుతురాజ్ గైక్వాడ్ ఈసారి 28 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మొయిన్ అలీ 34 పరుగులు చేశాడు. డెవోన్ కాన్వే మాత్రం మరోమారు మెరిశాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (56) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

మిగతా వారిలో మరెవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసిన చెన్నై విజయానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 10 మ్యాచ్‌లు ఆడిన చెన్నైకి ఇది ఏడో పరాజయం. ప్రస్తుతం ఆ జట్టు కింది నుంచి ఏడో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు అడుగంటిపోయినట్టే.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లోమ్రోర్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా కోహ్లీ 30, డుప్లెసిస్ 38, రజత్ పటీదార్ 21, దినేశ్ కార్తీక్ 26 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తీక్షణకు మూడు, మొయిన్ అలీకి రెండు వికెట్లు దక్కాయి. చక్కని బౌలింగ్‌తో చెన్నైని దెబ్బతీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి.

More Telugu News