TDP: నేను జ‌గ‌న్‌లా కాదు... దోచుకోలేదు, దాచుకోలేదు: చంద్ర‌బాబు

  • జ‌గ‌న్ వల్ల రాష్ట్రం మ‌రో శ్రీలంక‌లా మార‌డం ఖాయమన్న బాబు 
  • విద్యుత్ ఉండ‌దు గానీ... బిల్లు మాత్రం బాదుడే బాదుడు అంటూ కామెంట్ 
  • విచిత్ర‌మైన మ‌ద్యం బ్రాండ్ల కార‌ణంగా నాటు సారా వినియోగం పెరిగింద‌న్న టీడీపీ అధినేత  
  • రైతుల మోటార్ల‌కు జ‌గ‌న్ మీట‌ర్లు పెడ‌తారంటూ వ్యాఖ్య 
chandrababu fires on jagan government

ఏపీలో వైసీపీ స‌ర్కారు పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల‌ను నిర‌సిస్తూ టీడీపీ నిర్వ‌హిస్తున్న బాదుడే బాదుడు నిర‌స‌న‌లో ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండ‌లం ద‌ళ్ల‌వ‌ల‌స‌లో బుధ‌వారం రాత్రి జ‌రిగిన నిర‌స‌న స‌భ‌లో చంద్ర‌బాబు ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పాల‌న‌ను తూర్పార‌బ‌ట్టిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పాల‌న వ‌ల్ల రాష్ట్రం మ‌రో శ్రీలంక అవ‌డం ఖాయ‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అన‌గానే అంద‌రూ మాయ‌లో ప‌డిపోయార‌ని, ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌లో గెలుపుతో జ‌గ‌న్‌కు అహంకారం పెరిగింద‌ని ఆయన వ్యాఖ్యానించారు. త‌న ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేత‌లు.. అసెంబ్లీలోనే త‌న‌ను అవ‌మాన‌ప‌ర‌చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు త‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా అవ‌మాన‌ప‌ర‌చార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్‌ను క‌రోనా కంటే కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తిగా చంద్ర‌బాబు అభివ‌ర్ణించారు. రాష్ట్రంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను భారీగా పెంచార‌ని, విద్యుత్ ఉండ‌దు గానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడు మాదిరిగా ఉన్నాయ‌ని ఆరోపించారు. 

ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ల‌ను తాను రూ.140కే ఇస్తే.. జ‌గ‌న్ ఆ రేటును రూ.290కి పెంచార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. రాష్ట్రంలో విచిత్ర‌మైన మ‌ద్యం బ్రాండ్ల కార‌ణంగా నాటు సారా వినియోగం పెరిగింద‌న్నారు. తాను జ‌గ‌న్ మాదిరి కాద‌న్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ మాదిరిగా తాను దోచుకోలేద‌ని, దాచుకోనూ లేద‌ని సెటైర్ సంధించారు. ఉత్త‌రాంధ్ర‌లో ఒక్క ప్రాజెక్టు ప‌నులైనా చేయ‌లేద‌ని, రైతుల మోటార్లకు మాత్రం మీట‌ర్లు పెతానంటూ జ‌గ‌న్ చెబుతున్నార‌ని చంద్రబాబు ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News