MS Dhoni: సీజన్ మధ్యలో ధోనీకి నాయకత్వమా..?: స్పందించిన ఫాప్ డూప్లెసిస్

  • సీఎస్కే విజయాల్లో అతడిదే పెద్ద పాత్ర
  • ఆటగాళ్ల నుంచి మంచి ఫలితాలను రాబడతాడు
  • సీజన్ మధ్యలో కెప్టెన్సీ మార్పు ఆశ్చర్యకరం
  • తమపై ప్రభావం పడకుండా చూసుకోవాలన్న ఆర్సీబీ కెప్టెన్
Faf du Plessis opens up on MS Dhoni returning as captain Surprised it happened mid season

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలపై, ఆ జట్టు మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ అయిన ఫాప్ డూప్లెసిస్ స్పందించాడు. ఐపీఎల్ 2022 సీజన్ మరో రెండు రోజుల్లో ఆరంభం అవుతుందనగా.. కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. రవీంద్ర జడేజా ఈ బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. 

వరుస వైఫల్యాలతో కుంగిపోయిన జడేజా కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోగా.. తిరిగి ఆ బాధ్యతలను ధోనీకి అప్పగిస్తూ సీఎస్కే నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలు తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసినట్టు ఫాప్ డూప్లెసిస్ ప్రకటించాడు. 

‘‘ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉంటే ఆటగాళ్ల నుంచి మెరుగైన ఫలితాలను రాబట్టుకుంటాడు. సీఎస్కే విజయాలు సాధించడం వెనుక అతిపెద్ద అంశం ఇదే. ఇదే మాకు అతిపెద్ద సవాలు కూడా. ఇది మాపై బుధవారం ప్రభావం పడకుండా చూసుకోవాలి’’ అని ఫాప్ డూప్లెసిస్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 

దశాబ్దానికి పైగా సీఎస్కే జట్టు సభ్యుడిగా డూప్లెసిస్ సేవలు అందించాడు. ఈ విడత జట్టు అతడ్ని రిటైన్ చేసుకోలేదు. వేలంలో కొనుగోలు కూడా చేయలేదు. దీంతో ఆర్సీబీ అతడ్ని సొంతం చేసుకుని కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. బుధవారం సీఎస్కే, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో ధోనీ సామర్ధ్యాల గురించి డూప్లెసిస్ మాట్లాడడం ఆసక్తిని కలిగించింది. 

నిజానికి ఈ సీజన్ లో సీఎస్కే చేతిలో ఆర్సీబీ ఇప్పటికే ఒక ఓటమి చవిచూసింది. ఈ విడత అయినా విజయంతో సమం చేయాలనుకుంటోంది. ‘‘మేము మధ్య ఓవర్ల బౌలింగ్ పరంగా ఎంతో బలపడ్డాం. వారి బలాలు ఏంటో మాకు తెలుసు. భిన్న మార్గాల్లో వారిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హెస్సాన్ తెలిపారు.

More Telugu News