AP Govt: నో ఫోన్ జోన్లుగా టెన్త్ పరీక్ష కేంద్రాలు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీలో కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
  • పేపర్ లీక్ అంటూ నిత్యం వార్తలు
  • పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆంక్షలు
  • కనిపిస్తే స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
AP Govt announces Tenth Exam Centers as No Phone Zones

ఏపీలో టెన్త్ పరీక్షలు జరుగుతుండగా, ఫలానా సబ్జెక్టు లీక్ అంటూ ప్రతి రోజూ వార్తలు వస్తున్నాయి. అయితే, పరీక్ష ప్రారంభమైన తర్వాతే పేపర్ బయటికి వస్తోందని, అది మాల్ ప్రాక్టీస్ అని ప్రభుత్వం చెబుతోంది. అయితే, మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ వంటి ఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

టెన్త్ పరీక్షలు జరిగే కేంద్రాల్లో ఇకపై ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు పదో తరగతి పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించింది. ఆఖరికి పాఠశాల చీఫ్ సూపరింటిండెంట్లు కూడా పరీక్ష కేంద్రంలోకి ఫోన్లు తీసుకురాకూడదని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. 

పరీక్ష కేంద్రాల్లో ఫోన్లే కాదు... ఐప్యాడ్లు, స్మార్ట్ వాచ్ లు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు వంటి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించినా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై విద్యార్థి రోల్ నెంబరుతో పాటు పరీక్ష కేంద్రం నెంబరు కూడా వేసేలా చర్యలు తీసుకోవాలని టెన్త్ ఇన్విజిలేటర్లకు నిర్దేశించింది.

More Telugu News