Devi Nagavalli: హీరో విష్వక్సేన్ పై మంత్రి తలసానికి ఫిర్యాదు చేసిన యాంకర్ దేవీ నాగవల్లి

  • అనూహ్య వివాదంలో చిక్కుకున్న విష్వక్సేన్
  • సినిమా ప్రమోషన్ వికటించిన వైనం
  • టీవీ చానల్ చర్చలో యాంకర్ పై ఆగ్రహం
  • గెటవుట్ అన్న యాంకర్
Anchor Devi Nagavalli complains to minister Talasani

టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ తన చిత్రం అశోకవనంలో అర్జునకల్యాణం ప్రమోషన్స్ లో భాగంగా ప్రాంక్ వీడియో చేసి అనూహ్య వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే. ఈ ప్రాంక్ వీడియోపై ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమం నిర్వహించగా, ఆ చానల్ యాంకర్ కు, విష్వక్సేన్ కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరగడం, విష్వక్సేన్ ఓ అభ్యంతరకర పదం వాడడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఆ చానల్ యాంకర్ దేవి నాగవల్లి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దేవి వెంట జర్నలిస్ట్ ఫోరం సభ్యులు కూడా ఉన్నారు. 

దేవి ఫిర్యాదుపై మంత్రి తలసాని స్పందించారు. ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ సినిమా గురించి ప్రమోషన్స్ నిర్వహించుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాకాకుండా ప్రాంక్ వీడియోల పేరిట రోడ్లపై ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, దీనిపై తాను పోలీసు అధికారులతో మాట్లాడతానని వెల్లడించారు. 

అంతేకాకుండా, టీవీ చానల్లో యాంకర్ దేవి నాగవల్లి, హీరో విష్వక్సేన్ మధ్య జరిగిన వాగ్వాదాన్ని కూడా తాను చూశానని మంత్రి తలసాని వివరించారు. కానీ అటువంటి ప్రవర్తనను ఎవరూ అంగీకరించబోరని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తుందని అన్నారు. యాంకర్ నాగవల్లి కొన్ని అంశాలపై మాట్లాడుతుంటే, అతడు మరో రకంగా సమాధానం చెప్పడాన్ని సభ్యసమాజం హర్షించదని తెలిపారు.

మన కుటుంబాల్లోనూ ఆడవాళ్లు ఉంటారని, ఓ ఆడకూతుర్ని ఈ విధంగా అవమానించడం సబబు కాదని తలసాని హితవు పలికారు. ఈ అంశంలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ తరఫు నుంచి తీసుకోవాల్సిన చర్యలు, పోలీసు శాఖ నుంచి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడతానని వెల్లడించారు. దీనిపై అతడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన ఘటనను ఏదో లైట్ గా తీసుకుంటూ క్షమాపణలు చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని విష్వక్సేన్ వైఖరిని తలసాని ఖండించారు.

More Telugu News