Earth: అగ్నిపర్వతాలు బద్దలైతే.. భూమికి ముప్పే!

  • కృత్రిమ వాతావరణ కల్పన ద్వారా నాసా గుర్తింపు
  • అగ్నిపర్వతాలు పేలితే సల్ఫర్ డయాక్సైడ్ విడుదల
  • తొలుత ఏరోసోల్స్ గా మార్పిడి
  • వాటితో వాతావరణం చల్లబడడం కొంతకాలమే
  • ఆ తర్వాత నీటి ఆవిరి పెరిగి ఓజోన్ కు నష్టం
Volcanic Eruptions Has Enormous Effects On Earth

ఇటీవల పసిఫిక్ దీవుల్లోని హూంగా టోంగా- హూంగా హపాయ్ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు.. ప్రపంచ వ్యాప్తంగా దాని ప్రకంపనలు నమోదయ్యాయి. సునామీ హెచ్చరికలు వెలువడ్డాయి. దాని నుంచి చిమ్మిన బూడిద చుట్టుపక్కల గ్రామాలను ముంచేసింది. అయితే, అగ్నిపర్వతాలు ఇంతలా బద్దలైనప్పుడు భూమిపై పెను ప్రభావమే పడుతుందని, ముప్పు వాటిల్లుతుందని నాసా హెచ్చరించింది. 

భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ పొర నాశనమవుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి వందల ఏళ్ల నాటి వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించడం ద్వారా ఈ విషయాలను గుర్తించింది. సూర్యుడి నుంచి విడుదలయ్యే ప్రమాదకర అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుందన్న సంగతి తెలిసిందే. 

అయితే, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు.. దాని నుంచి విడుదలయ్యే బూడిద, పొగ ద్వారా ప్రమాదకరమైన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుందని, దాని వల్ల ఓజోన్ పొరకు భారీగా రంధ్రం పడుతుందని నాసా సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 

సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనప్పుడు తొలుత ఏరోసోల్స్ గా మారుతాయని, ఆ క్రమంలో సూర్యుడి నుంచి వచ్చే వేడిని ప్రతిబింబిస్తాయని అంటున్నారు. అప్పుడు కొంతకాలం పాటు వాతావరణం చల్లబడుతుందని, అయితే, పరారుణ కాంతిని బాగా శోషించుకుంటుందని, ఆ తర్వాత వాతావరణం మరింత వేడెక్కుతుందని చెప్పారు. 

దాని వల్ల ఆ ప్రాంతంలో నీటి ఆవిరి 10 వేల శాతం పెరుగుతుందని అంటున్నారు. ఆ నీటి ఆవిరి వల్ల ఓజోన్ పొరకు పెద్ద రంధ్రం పడుతుందని అన్నారు. ఫ్లడ్ బసాల్ట్స్ (ఏళ్లతరబడి అగ్నిపర్వతాలు బద్దలై లావా, పొగ విడుదలవ్వడం) వల్ల కార్బన్ డయాక్సైడ్ కూడా విడుదలవుతుందని, అయితే, దాని వల్ల వేడి అంతగా వెలువడదని, ఓజోన్ పై పెద్దగా ప్రభావం ఉండదని వెల్లడైందని అంటున్నారు. అంగారకుడు, శుక్ర గ్రహంపైనా ఇలాంటి పరిణామాలే జరిగాయని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News