Jagga Reddy: మీ నేతలు రాత్రి పూట ఎక్కడకెళ్తున్నారో బయటపెట్టమంటారా?: జగ్గారెడ్డి

TRS is doing worst politics says Jagga Reddy
  • చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో
  • ఫంక్షన్ కు వెళ్లిన చోట ఏముందో రాహుల్ కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించిన జగ్గారెడ్డి
  • టీఆర్ఎస్ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపాటు
నేపాల్ లోని ఖాట్మండూ నైట్ క్లబ్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాహుల్ పై బీజేపీ, టీఆర్ఎస్ తదితర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫంక్షన్ కు వెళ్లిన చోట ఏముందో రాహుల్ కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అక్కడ జరిగేదానికి, రాహుల్ కు ఏం సంబంధమని అన్నారు. 

రాహుల్ ఫంక్షన్ కు వెళ్లిన వీడియోలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లికి వెళ్లిన వీడియోపై రాజకీయం చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు చిల్లరగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నేతలు రాత్రి పూట ఎక్కడకు వెళ్తున్నారో చెప్పమంటారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 

వరంగల్ లో ఈ నెల 6న జరగనున్న రాహుల్ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని జగ్గారెడ్డి కోరారు. తెలంగాణలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీస్తారని అన్నారు. అసైన్డ్ భూములు, స్వాతంత్ర్య సమరయోధులు, ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం లాక్కొంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలన మొత్తం గ్రాఫిక్స్ మయమని చెప్పారు.
Jagga Reddy
Rahul Gandhi
Congress
TRS

More Telugu News