Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కేన్సర్ సర్జరీ?.. మీడియాలో పలు కథనాలు

  • శస్త్రచికిత్స తప్పనిసరి అని చెప్పిన వైద్యులు
  • ఇంకా నిర్ణయించుకోని పుతిన్
  • విశ్వసనీయుడైన పత్రుషేవ్ కు అధికారం బదిలీ
  • వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్ కథనం
Putin to undergo cancer treatment surgery handover power temporarily

ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా బలగాలు అలుపెరుగని పోరాటం చేస్తుంటే.. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన కలిగించే వార్తలు వెలుగు చూస్తున్నాయి. పుతిన్ కేన్సర్ సర్జరీ చేయించుకోనున్నట్టు, అధికార బాధ్యతలను తనకు విశ్వసనీయుడైన, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ నికోలాయ్ పత్రుషేవ్ కు తాత్కాలికంగా అప్పగించనున్నట్టు తాజాగా మీడియా కథనాలు వెలుగు చూశాయి.

తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాల్సిందేనని వైద్యులు పుతిన్ కు స్పష్టం చేసినట్టు ఓ టెలిగ్రామ్ ఛానల్ సమాచారం ఆధారంగా న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. దీనిపై పుతిన్ ఇంకా నిర్ణయం తీసుకున్నట్టు లేదు. సదరు టెలిగ్రామ్ ఛానల్ ను రష్యా ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ లెఫ్టినెంట్ జనరల్ నిర్వహిస్తున్నది కావడంతో ఇది నిజమే కావచ్చన్న అభిప్రాయం నెలకొంది.

సర్జరీకి వెళితే పుతిన్ స్వల్పకాలం పాటు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. కేన్సర్ తోపాటు, పార్కిన్ సన్స్ వ్యాధితో పుతిన్ బాధపడుతున్నట్టు ఈ కథనంలో న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. కాగా, ఈ సమాచారం ఇంకా ధ్రువీకరించుకోలేదని పెంటగాన్ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

ఒకవేళ సర్జరీ తర్వాత పుతిన్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారితే అప్పుడు రష్యాను పత్రుషేవ్ శాసించనున్నారు. పుతిన్ విశ్వసించే ఏకైక వ్యక్తి ఇతడేనన్నది విశ్లేషణ. పుతిన్ కంటే పత్రుషేవ్ మరింత ప్రమాదకారి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పత్రుషేవ్ అధికారంలోకి వస్తే రష్యా సమస్యలు మరింత ఎక్కువ అవుతాయని సదరు టెలిగ్రామ్ ఛానల్ యజమాని పేర్కొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

More Telugu News