Varla Ramaiah: చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌హెచ్చార్సీకి వర్ల రామయ్య లేఖ

  • ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వేణుగోపాల్ అనే వ్య‌క్తిపై దాడి చేశార‌న్న రామ‌య్య‌
  • ఇందుకు సంబంధించిన వీడియోను పంపిన టీడీపీ నేత‌
  • వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించార‌ని వ్యాఖ్య‌
Varla Ramaiah writes letter to nhrc

సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్‌హెచ్చార్సీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఫిర్యాదు చేసేందుకు చిలమత్తూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన‌ వేణుగోపాల్ అనే వ్య‌క్తిపై ఎస్ఐ దాడి చేశార‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న పంపారు.  

హిందూపురం అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గంలోని సజీవరాయనపాలేనికి చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతోంద‌ని, అయితే, ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నేత‌లు ఆమె పెన్షన్‌ను తొలగించారని వ‌ర్ల రామ‌య్య పేర్కొన్నారు.  

ఈ విష‌యాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి అక్ర‌మంగా కేసు పెట్టారని వ‌ర్ల రామ‌య్య అన్నారు. దీంతో వాస్తవాలను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై ఎస్ఐ అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ దాడి చేశార‌ని వివ‌రించారు. 

ఎస్ఐ తీరు స‌రికాద‌ని, వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించార‌ని ఆయ‌న చెప్పారు. ఎస్ఐ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. వైసీపీ ప్రభుత్వ పాల‌న‌లో ఏపీలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆయ‌న చెప్పారు. 

More Telugu News