అవకాశం వస్తే మళ్లీ మిలిందానే పెళ్లాడతా: బిల్‌గేట్స్ మనసులో మాట
- గతేడాది విడాకులు తీసుకున్న బిల్ గేట్స్-మిలిందా
- విడిపోయినా ఫౌండేషన్‌ను కలిసే నిర్వహిస్తున్న వైనం
- తన జీవితంలో జరిగిన అతిపెద్ద మార్పు విడాకులేనన్న గేట్స్
- తన దృష్టిలో తమది గొప్ప వివాహమని అభివర్ణన
తాజాగా ‘సండే టైమ్స్’తో మాట్లాడిన గేట్స్.. గత రెండేళ్లు ఎలా గడిచిందీ వివరించారు. ఈ కాలంలో తన జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారై కుటుంబాన్ని విడిచి వెళ్లాక వివాహ బంధంలో మార్పు వస్తుందని, కానీ తన జీవితంలో జరిగిన అతిపెద్ద మార్పు మాత్రం విడాకులేనని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో తమది గొప్ప వివాహమని పేర్కొన్నారు. అయితే, జరిగిపోయిన దానిని మార్చలేమన్నారు.
తాను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, అవకాశమంటూ వస్తే మిలిందానే మళ్లీ పెళ్లాడతానని చెప్పుకొచ్చారు. విడిపోయినా ఆమెతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. భవిష్యత్ పరంగా తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని అయితే, మిలిందాను మళ్లీ పెళ్లాడడం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా గేట్స్ చెప్పుకొచ్చారు.