రాజశేఖర్ రెడ్డి పెంపకంలో తప్పేమీ లేదు.. ఆయన్ను ఏమీ అనొద్దు: జేసీ ప్రభాకర్ రెడ్డి

02-05-2022 Mon 15:13
  • జగన్ ను పెంచడం వైఎస్ కు కష్టమయిందన్న జేసీ 
  • జగన్ తల్లిదండ్రుల పెంపకం మంచిదేనని వ్యాఖ్య 
  • రాజారెడ్డి పెంపకంలో ఆయన మరో రాజారెడ్డి అయ్యారంటూ కామెంట్ 
JC Prabhakar Reddy comments on Jagan
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పెంపకం గురించి టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను ఆయన తల్లి సరిగా పెంచలేదని ఒక మహాతల్లి చెప్పారని... ఆమె ఎలా పెంచారో అడిగి తెలుసుకుంటానని చెప్పారు. అయితే ఆయనను పెంచడం తమ వైఎస్ రాజశేఖరరెడ్డికి కష్టం అయిందని అన్నారు. 

జగన్ తల్లిదండ్రుల పెంపకం మంచిదేనని... అయితే జగన్ అప్పటికే డైవర్ట్ అయి తాత రాజారెడ్డి దగ్గరకు వెళ్లాడని... ఆయన పెంపకంలో సేమ్ టు సేమ్ మరో రాజరెడ్డిలా అయ్యాడని చెప్పారు. ఈ విషయంలో తమ రాజశేఖరరెడ్డిని ఏమీ అనొద్దని జేసీ వ్యాఖ్యానించారు. 

ప్రబోధానంద ఆశ్రమం కేసులో జిల్లా ఎస్పీ అనే దేవుడి వద్దకు తాను వెళ్లానని... అయితే, ఆయన చేతిలో ఏమీ లేదని, ఆ ఫైల్ సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద ఉందని జేసీ అన్నారు. తాడిపత్రి వైసీపీ నేతలు చెప్పిన వారిపైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. దీనికి ఏదో ఒక రోజు సజ్జల సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని అన్నారు. పెద్దవడుగూరు ఎస్సై అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ డ్రెస్ వేసుకున్నావా? అంటూ ప్రశ్నించారు. అత్యుత్సాహాన్ని తగ్గించుకోకపోతే జనం తిరగబడతారని జేసీ హెచ్చరించారు.